
ఇంతకీ ఆ రికార్డేంటంటే.. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌తో సమంగా అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ ఇప్పటివరకు 156 క్యాచ్‌లు పట్టాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. అజారుద్దీన్ ఈ రికార్డును 332 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా, కోహ్లీ మాత్రం కేవలం 295 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
మొత్తంగా చూసుకుంటే వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే (218 క్యాచ్‌లు) మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (160 క్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. వీళ్ల తర్వాత కోహ్లీనే.
ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. కోహ్లీ ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కేవలం ఒక్క బౌండరీ మాత్రమే కొట్టాడు. లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. గత ఆరు వన్డేల్లో కోహ్లీ లెగ్‌స్పిన్నర్ బౌలింగ్‌లో అవుట్ కావడం ఇది ఆరోసారి. లెగ్‌స్పిన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ కాస్త బలహీనంగా ఉన్నాడని మరోసారి తేలిపోయింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను 228 పరుగులకే ఆలౌట్ చేయడంలో భారత బౌలర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. షమీ 53 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో షమీ మరో రికార్డు కూడా సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. బంతుల పరంగా చూస్తే షమీనే ఫాస్టెస్ట్. ఇక మ్యాచ్‌ల పరంగా చూస్తే రెండో ఫాస్టెస్ట్.
229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 50కి పైగా పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 41 పరుగుల వద్ద ఔటయ్యాక, కోహ్లీ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది, చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.
గిల్ అజేయ సెంచరీతో (101*) మెరిశాడు. ఇది గిల్‌కు ఐసీసీ టోర్నీల్లో మొట్టమొదటి సెంచరీ కావడం విశేషం. ఇక టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న (ఆదివారం) బ్లాక్‌బస్టర్ పోరులో తలపడనుంది. ఆ మ్యాచ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.