టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా వన్డే క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ బ్యాటర్ ఎవరనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. చాలా మంది సచిన్ టెండూల్కర్ ని క్రికెట్ దేవుడిగా కొలుస్తుంటే, సెహ్వాగ్ మాత్రం విరాట్ కోహ్లీనే టాప్ ప్లేస్ లో పెట్టేశాడు. తన తోటి ఆటగాడు సచిన్ ను రెండో స్థానంలో ఉంచడం విశేషం. క్రికెట్ వెబ్ సైట్ 'క్రిక్ బజ్'తో మాట్లాడుతూ కోహ్లీని ఎందుకు నంబర్ వన్‌గా ఎంచుకున్నాడో సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చాడు.

సెహ్వాగ్ సెలెక్ట్ చేసిన టాప్-5 వన్డే బ్యాటర్ల లిస్టులో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ నంబర్ 5లో ఉన్నాడు. గేల్ 304 వన్డేల్లో 10,480 పరుగులు చేశాడు. అతడు ఎంతటి హిట్టరో అందరికీ తెలుసు. 2002-03లో వెస్టిండీస్ టూర్‌లో ఇండియా ఆడిన ఆరు మ్యాచ్‌ల సిరీస్ లో గేల్ ఏకంగా మూడు సెంచరీలు బాదిన విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఫాస్ట్ బౌలర్లకు బ్యాక్‌ఫుట్‌పై సిక్సర్లు కొట్టే గేల్ టాలెంట్‌ను మెచ్చుకున్నాడు.

ఇక నంబర్ 4లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఏబీడీ 228 వన్డేల్లో 9,577 రన్స్ చేశాడు. బ్యాలెన్స్ తప్పినా సిక్సర్లు కొట్టగల ఏబీడీ సామర్థ్యం అద్భుతం అని సెహ్వాగ్ అన్నాడు. నంబర్ 3 ప్లేస్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఉన్నాడు. ఇంజీ 350 వన్డేల్లో 11,739 పరుగులు చేశాడు. ప్రెజర్ సిట్యువేషన్ లో, టెన్షన్ చేజింగుల్లో ఇంజమామ్ చాలా కూల్ గా ఆడేవాడని, గేమ్‌ను కంట్రోల్ చేసే అతడి టాలెంట్ ను సెహ్వాగ్ పొగిడాడు.

సెహ్వాగ్ రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్ నంబర్ 2లో నిలిచాడు. సచిన్ తో కలిసి గ్రౌండ్‌లోకి అడుగుపెడితే అదొక వేరే ఫీలింగ్ అని, అడవిలో సింహం వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉండేదని, అందరి కళ్లూ సచిన్ పైనే ఉండేవని సెహ్వాగ్ చెప్పాడు. సచిన్ లెజెండ్ అని కొనియాడాడు.

చివరిగా విరాట్ కోహ్లీని నంబర్ 1 గా సెలెక్ట్ చేశాడు సెహ్వాగ్. వన్డే హిస్టరీలోనే కోహ్లీ అంత కన్సిస్టెంట్ ప్లేయర్ మరొకరు ఉండరని తేల్చి చెప్పాడు. 2011-12 తర్వాత కోహ్లీ ఫిట్నెస్ పెంచుకుని మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్‌లతో దుమ్మురేపాడని గుర్తు చేశాడు. కోహ్లీలా మ్యాచ్ లను ఛేజ్ చేసే ప్లేయర్ రావడం కష్టమని, అందుకే అతడిని 'ఛేజ్ మాస్టర్' అని పిలుస్తారని సెహ్వాగ్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: