
దుబాయ్‌లో అభిమానులతో స్టేడియం నిండిపోయింది. అలాంటి వాతావరణంలో, కోహ్లీ తనను "ఛేజ్ మాస్టర్" అని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు. భారత్ 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినప్పుడు, కోహ్లీ తన భుజాలపై విన్నింగ్ బాధ్యతను వేసుకున్నాడు.
కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే పాత రోజులు గుర్తుకొచ్చాయి. టీమ్ విజయం సాధించేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుని ఆడాడు. సింగిల్స్ తీస్తూ, బౌండరీలు బాదుతూ, మ్యాచ్ గెలిచే వరకు క్రీజులో నిలబడ్డాడు. కోహ్లీ గతంలో చాలాసార్లు ఇలాగే చేశాడని ఫ్యాన్స్ సంబరపడ్డారు.
విరాట్ అద్భుతంగా ఆడాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. క్రికెట్ అభిమానులందరికీ ఇది కన్నుల పండుగే. అంతేకాదు, వన్డేల్లో 14,000 పరుగులు వేగంగా పూర్తి చేసిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రిజ్వాన్‌కు కోహ్లీ బ్యాటింగ్ చూసి నోట మాట రాలేదు. ముఖ్యంగా 36 ఏళ్ల వయసులో కోహ్లీ అంత ఫిట్‌గా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
"ముందుగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలి. అతని కష్టాన్ని చూసి నేను ఆశ్చర్యపోయా. కోహ్లీ చాలా కష్టపడి ఉంటాడు. ఫామ్‌లో లేడని ప్రపంచమంతా అంటోంది. కానీ ప్రపంచం మొత్తం ఎదురుచూసే ఇలాంటి పెద్ద మ్యాచ్‌లలో సులువుగా బంతిని బాదుతున్నాడు. పరుగులు ఇవ్వకూడదని మేం అనుకున్నాం. కానీ అతను ఆడి పరుగులు రాబట్టాడు. మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు." అని మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో రిజ్వాన్ అన్నాడు.
"అతని ఫిట్‌నెస్ లెవెల్స్‌ను, కష్టాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను క్రికెటర్, మేం కూడా క్రికెటర్లమే. అతన్ని ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ అతను మ్యాచ్‌ను గెలిపించాడు. అతను చాలా కష్టపడ్డాడు. ఫామ్‌లో లేడని ప్రపంచమంతా అంది. కానీ ఈ పెద్ద మ్యాచ్‌లో నిరూపించాడు." అని రిజ్వాన్ ఇంకా అన్నాడు.
పాకిస్థాన్ ఆటతీరు గురించి మాట్లాడుతూ రిజ్వాన్ నిజం ఒప్పుకున్నాడు. తమ జట్టు మూడు విభాగాల్లోనూ విఫలమైందని తేల్చి చెప్పాడు.
"మ్యాచ్ గురించి చెప్పాలంటే.. ఓటమి పాలయ్యాం కాబట్టి నిరాశగా ఉంది. ఓడిపోతే కష్టంగానే ఉంటుంది. చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ నిజం చెప్పాలంటే, అబ్రార్ బౌలింగ్ ఒక్కటే ఈ మ్యాచ్‌లో పాజిటివ్‌గా ఉంది. మిగతా అన్ని విభాగాల్లోనూ తప్పులు జరిగాయి. అందుకే మ్యాచ్ ఓడిపోయాం." అని రిజ్వాన్ కుండబద్దలు కొట్టాడు.
బ్యాక్ టు బ్యాక్ ఓటములతో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే ఆశలు దాదాపుగా నీరుగారిపోయాయి. ఇప్పుడు పాకిస్థాన్ భవితవ్యం బంగ్లాదేశ్ చేతుల్లో ఉంది. సోమవారం రావల్పిండిలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే, పాకిస్థాన్‌కు ఇంకా ఛాన్స్ ఉంటుంది. లేదంటే సర్దుకోవాల్సిందే.