
ఇమామ్ ఔట్ అవ్వడానికి కారణం అతనే చేసుకున్న తప్పిదంలా అనిపించింది. మిడ్-ఆన్‌లో ఉన్న అక్షర్ పటేల్‌కు బంతిని స్ట్రెయిట్‌గా కొట్టి.. సింగిల్ తీసేద్దామని అనుకున్నాడు. కానీ, అక్కడ డేంజర్ ఉందని అస్సలు గ్రహించలేదు. అక్షర్ పటేల్ మాత్రం మెరుపులా స్పందించాడు. చటుక్కున బంతిని వికెట్ల మీదకు విసిరాడు. ఇమామ్ అప్పటిదాకా ఏమీ పట్టనట్టు నిలబడి.. చివరి క్షణంలో డైవ్ చేసినా లాభం లేకపోయింది. బంతి వికెట్లను గిరాటేసింది. అంతే.. ఇమామ్ రనౌట్!
ఇండియాతో జరుగుతున్న ఈ కీలకమైన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆల్రెడీ ఒత్తిడిలో ఉంది. ఫఖర్ జమాన్ గాయం కారణంగా జట్టులో లేకపోవడంతో ఇమామ్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ వచ్చింది. కానీ, అతను దాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. పైగా ఇలాంటి సమయంలో ఇలా ఔట్ అవ్వడం టీమ్‌కి మరింత నష్టం చేసింది. బలమైన ఇండియన్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోవడంలో పాక్ బ్యాటింగ్ లైనప్ మరింత కష్టాల్లో పడింది.
"బాబాయ్ లాగే అబ్బాయ్" అంటూ ట్రోలింగ్
ఇమామ్ ఔట్ అవ్వగానే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. నెటిజన్లు ఇంజమామ్ రనౌట్ అయిన పాత వీడియో క్లిప్స్‌ను షేర్ చేస్తూ.. ఇమామ్‌తో పోల్చడం మొదలుపెట్టారు. మీమ్స్, జోకులు క్షణాల్లో వైరల్ అయ్యాయి. "వికెట్ల మధ్య రన్నింగ్ వీళ్ల కుటుంబంలోనే బలహీనత" అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బాగుందని, భారీ స్కోరు చేయొచ్చని అనుకున్నాడు. మ్యాచ్‌కు ముందు రిజ్వాన్ మాట్లాడుతూ.. "ఐసీసీ టోర్నీల్లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. మేం మాత్రం నార్మల్‌గానే ఉంటాం" అని చెప్పాడు.
కానీ, ఇమామ్ తొందరగా ఔట్ అవ్వడంతో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. అతని పేలవమైన రన్నింగ్.. దానికి తోడు ఇండియా బౌలర్ల ధాటి.. వెరసి పాక్ టీమ్ మరింత ఇబ్బంది పడింది. ఇంత ముఖ్యమైన మ్యాచ్‌లో ఇమామ్ కనీసం కాస్తైనా బాధ్యతగా ఆడాల్సింది.