భారత్ చేతిలో ఓడిపోతే పాకిస్థాన్‌లో 'టీవీ పగలగొట్టే సంప్రదాయం' మళ్లీ మొదలైంది. అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం పాకిస్థాన్ అభిమానులు టీవీలు పగలగొట్టడమే. భారత్ గెలిచిన ప్రతిసారి పాకిస్థాన్‌లో కనిపించే ఈ 'టీవీ పగలగొట్టే సంప్రదాయాన్ని' చూసి టీమిండియా ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు.
ఒక వీడియోలో అయితే, కొందరు వ్యక్తులు ఏకంగా టీవీని మోసుకొచ్చి నేలకేసి కొట్టేశారు. అంతేకాదు, టీవీ పగిలిపోయినా వారి కోపం తగ్గలేదు. మరింత రెచ్చిపోయి, ఆ టీవీని తన్నుకుంటూ, ముక్కలు ముక్కలు చేశారు. ఆ తర్వాత, విరిగిపోయిన టీవీ క్యాబినెట్‌ను కూడా నేలకేసి కొట్టి మరీ తమ ఆగ్రహాన్ని చల్లార్చుకున్నారు.
ఇంకో వీడియోలో షాపు ముందు గుంపుగా నిలబడ్డ జనం కనిపించారు. వాళ్లు ఏకంగా గోడకు వేలాడదీసిన టీవీని లాక్కొచ్చి నేలకేసి కొట్టారు. అందరూ కలిసి ఆ టీవీని తన్నుతూ పూర్తిగా ధ్వంసం చేశారు.
ఇంకో షాకింగ్ వీడియో ఏంటంటే, ఒక ఫ్యామిలీ టీవీలో మ్యాచ్ చూస్తోంది. అంతలో వికెట్ పడగానే, నేల మీద కూర్చున్న పిల్లాడు కోపంతో ఏం చేశాడో తెలుసా, అక్కడే ఉన్న వాటర్ బాటిల్‌ని టీవీకి గురి చూసి విసిరాడు. అంతే, టీవీ ఒక్కసారిగా పగిలిపోయి కింద పడిపోయింది. ఇంట్లో వాళ్లంతా ఒక్క క్షణం షాక్ తిన్నారు. ఆ తర్వాత ఒకాయన "ఈ టీవీ లక్ష రూపాయలు ఉంటుంది" అని వాపోయాడు. పిల్లాడు చేసిన పనికి తానే షాకయ్యాడు. ఇక ఆ ఫ్యామిలీ పరిస్థితి చెప్పక్కర్లేదు, దిమ్మతిరిగిపోయినట్టు ఉండిపోయారు.