భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచంలో హీట్ ఎక్కిపోతుంది. అలాంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పాక్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అద్భుతమైన బంతితో శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేశాడు. కానీ.. ఆ తర్వాత అతను చేసిన సెలెబ్రేషన్ మాత్రం లెజెండరీ పేసర్ వసీం అక్రమ్‌కు ఏ మాత్రం నచ్చలేదు, అందుకే ఓపెన్‌గానే అతన్ని దులిపేసాడు.

దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో ఇండియా పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. 242 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా బ్యాటర్లు పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. అబ్రార్ ఒక్కడే కాస్తంత ఇండియా బ్యాటింగ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. మిడిల్ ఓవర్లలో అతడు వేసిన మాయాజాలానికి ఇండియన్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు.

అయితే 17వ ఓవర్లో అబ్రార్ వేసిన బంతి మాత్రం మ్యాచ్‌కే హైలైట్. లెగ్ స్టంప్‌ లైన్‌పై పడిన బంతి ఒక్కసారిగా టర్న్ తీసుకుని టాప్ ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. గిల్ షాక్ అవ్వడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. అంతకుముందు 52 బంతుల్లో 46 రన్స్ చేసి మంచి టచ్‌లో కనిపించిన గిల్‌ను అబ్రార్ బోల్తా కొట్టించాడు.

వికెట్ తీసిన సంతోషంలో అబ్రార్ తన స్టైల్లో గిల్‌కు ఘాటుగా సెండాఫ్ ఇచ్చాడు. గిల్ అయితే సైలెంట్‌గా వెళ్లిపోయాడు కానీ.. వసీం అక్రమ్‌తో సహా చాలా మందికి మాత్రం అబ్రార్ చేసిన పని నచ్చలేదు. కొంచెం ఎక్కువ ఓవర్‌గానే అనిపించింది.

"బంతి అయితే సూపర్ వేశాడు. కానీ సెలెబ్రేషన్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. టైమ్ అండ్ ప్లేస్ చూసుకోవాలి కదయ్యా బాబు" అంటూ వసీం అక్రమ్ స్పోర్ట్స్ సెంట్రల్‌తో చిట్ చాట్ చేశాడు. "తప్పు చేస్తున్నావని చెప్పేవాళ్లే లేరా అక్కడ? మ్యాచ్ సిట్యుయేషన్ చూడు.. టీమ్ కష్టాల్లో ఉంది. కానీ నువ్వేమో ఐదు వికెట్లు తీసినంత బిల్డప్ ఇస్తున్నావ్." అంటూ అక్రమ్ ఫైర్ అయ్యాడు.

అబ్రార్ సెలెబ్రేషన్ వల్ల ఆ వికెట్ తీసిన మూమెంట్ మొత్తం పోయిందని అక్రమ్ అన్నాడు. గిల్ అవుటైనా ఇండియా స్కోర్ బోర్డు మాత్రం ఆగలేదు. షాహీన్ అఫ్రీది, హరీస్ రౌఫ్ లాంటి స్టార్ బౌలర్లు అబ్రార్‌కు ఏ మాత్రం సపోర్ట్ చేయలేకపోయారు. దీంతో మరోవైపు నుంచి పరుగుల వరద పారింది.

విరాట్ కోహ్లీ మాత్రం అద్భుత సెంచరీతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తన 51వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా ఈజీగా టార్గెట్‌ను చేజ్ చేసింది. పాకిస్తాన్ మాత్రం మరోసారి ఇండియా చేతిలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి త్వరగా నిష్క్రమించే ప్రమాదంలో పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: