పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. బాబర్ ఆజమ్‌పై నిప్పులు చెరిగాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలం కావడంతో అతడు తీవ్ర విమర్శలు చేశాడు. పాక్ క్రికెట్ జట్టు తప్పుడు వ్యక్తులను హీరోలుగా ఎంచుకుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

నిన్న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ మరోసారి నిరాశపరిచాడు. 26 బంతుల్లో కేవలం 23 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు బౌండరీలు ఉన్నా.. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు.

ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ, బాబర్ ఆజమ్‌ను టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోల్చాడు. కోహ్లీకి సచిన్ టెండూల్కర్ ఆదర్శమని, సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీలు సాధించాడని గుర్తు చేశాడు. కోహ్లీ కూడా సచిన్ రికార్డులను బద్దలు కొడుతూ టాప్ క్రికెటర్‌గా ఎదిగాడని చెప్పాడు. కానీ బాబర్ మాత్రం "టుక్ టుక్" ఆటగాడిని ఆదర్శంగా తీసుకున్నాడని ఎద్దేవా చేశాడు. టుక్ టుక్ అంటే నెమ్మదిగా, రక్షణాత్మకంగా ఆడే ఆటతీరును విమర్శించేందుకు వాడే పదం.

"మేం ఎప్పుడూ బాబర్ ఆజమ్‌ను విరాట్ కోహ్లీతో పోలుస్తాం. కానీ కోహ్లీ హీరో ఎవరు? సచిన్ టెండూల్కర్. మరి బాబర్ హీరో ఎవరు? టుక్ టుక్!" అంటూ అక్తర్ 'గేమ్ ఆన్ హై' షోలో సెటైర్లు వేశాడు.

"పాక్‌ ఆలోచనా విధానమే తప్పుగా ఉంది. మీరు తప్పుడు హీరోలను ఎంచుకున్నారు. 2001 నుంచి ఈ క్షీణతను నేను చూస్తూనే ఉన్నా. నాకు ఈ జట్టు గురించి మాట్లాడాలని కూడా లేదు. డబ్బులు ఇస్తున్నారు కాబట్టే మాట్లాడుతున్నా. ఇది టైమ్ వేస్ట్" అని అక్తర్ ఘాటుగా విమర్శించాడు.

ఇంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌద్ షకీల్ హాఫ్ సెంచరీతో పాక్ 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ భారత్ ఆ లక్ష్యాన్ని 45 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది.

ఇక సోమవారం న్యూజిలాండ్.. బంగ్లాదేశ్‌పై విజయం సాధించడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. పాక్‌ తన చివరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: