ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. బుధవారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్ చేతిలో 8 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. జోస్ బట్లర్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ జట్టు, తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతోనే ఒత్తిడిలో పడింది. ఇప్పుడు అఫ్ఘనిస్తాన్‌తో చేతిలో ఓటమి పాలు కావడంతో వాళ్ల పరిస్థితి మరింత దిగజారింది. మార్చి 1న సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్ ఇంగ్లాండ్‌కు నామమాత్రమే అయినా సౌత్ ఆఫ్రికాకు మాత్రం కీలకం కానుంది.

గ్రూప్ Bలో బలహీనమైన జట్టుగా భావించే అఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓడిపోవడం ఇంగ్లాండ్‌కు పెద్ద అవమానమే. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా ఓడిపోయింది. ఇప్పుడు మంచి టార్గెట్‌ను ఛేజ్ చేయలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అఫ్ఘనిస్తాన్ గెలుపు వెనుక కీలక వ్యక్తి ఎవరంటే, ఆ జట్టు హెడ్ కోచ్ జొనాథన్ ట్రోట్. ఆశ్చర్యంగా ఉంది కదూ. ట్రోట్ ఒకప్పుడు ఇంగ్లాండ్ ఆటగాడు. 2009 నుంచి 2015 వరకు ఇంగ్లాండ్ తరపున ఆడిన ట్రోట్.. 2022 నుంచి అఫ్ఘనిస్తాన్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శిక్షణలో అఫ్ఘనిస్తాన్ జట్టు బాగా మెరుగుపడింది. ఇదివరకే 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన అఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేసింది.

మరో విషయం ఏంటంటే, ట్రోట్ పుట్టింది సౌతాఫ్రికాలోని కేప్ టౌన్‌లో. సౌతాఫ్రికా అండర్-15, అండర్-19 జట్లకు కూడా ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు షిఫ్ట్ అయి.. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపి.. ఇంగ్లాండ్ నేషనల్ టీమ్‌లో స్థానం సంపాదించాడు. 2009 యాషెస్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి సెంచరీతో అదరగొట్టాడు. 2011లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా నిలిచాడు. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్‌లోకి వచ్చి, ఇప్పుడు తన పాత టీమ్‌నే ఓడించే సత్తా ఉన్న అఫ్ఘనిస్తాన్ టీమ్‌ను తయారు చేశాడు.

విక్టరీ తర్వాత ట్రోట్ తన ప్లేయర్లను ఆకాశానికెత్తాడు. ముఖ్యంగా ఇబ్రహీం జద్రాన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. జద్రాన్ కేవలం 146 బంతుల్లో 177 పరుగులు చేసి అఫ్ఘనిస్తాన్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఒక దశలో 39/3తో కష్టాల్లో పడ్డ జట్టును జద్రాన్ తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. హష్మతుల్లా షాహిది (103 పరుగులు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (72 పరుగులు)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో మహ్మద్ నబీతో కలిసి కేవలం 55 బంతుల్లోనే 111 పరుగులు జోడించాడు. చివరి 10 ఓవర్లలోనే అఫ్ఘనిస్తాన్ ఏకంగా 113 పరుగులు పిండుకుంది.

జద్రాన్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని కొనియాడాడు ట్రోట్. మిగతా ప్లేయర్ల సపోర్ట్‌ను కూడా మెచ్చుకున్నాడు. జద్రాన్ సరైన టైమ్‌లో ఫామ్ అందుకున్నాడని.. ఆస్ట్రేలియాతో జరిగే నెక్స్ట్ మ్యాచ్‌లో కూడా ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ సంచలన విజయంతో అఫ్ఘనిస్తాన్ మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తమ సత్తా చాటింది. ఇంగ్లాండ్ మాత్రం ఘోర పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించి ఏం చేయాలో పాలుపోక డీలా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: