ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 2 మ్యాచుల్లో కూడా పాకిస్థాన్ జట్టు దారుణంగా ఓటమిని చవిచూడడంతో సర్వత్రా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక పాకిస్థాన్ దేశపు ప్రజల విమర్శలకైతే లెక్కేలేదు. తీవ్ర స్థాయిలో పాకిస్థాన్ జట్టుని ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ కు గట్టి షాక్ తగిలింది. అవును, తాజా సమాచారం ప్రకారం... పాకిస్థాన్ జట్టు తాత్కాలిక కోచ్‌ అయినటువంటి అకిబ్‌ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిపై వేటు వేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ దిశగా పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్ధమవుతున్నట్లు వినికిడి.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో దారుణమైన ప్రదర్శన చేసి పాకిస్థాన్ ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు ఆ జట్టుకు స్పాన్సర్లు రావడం చాలా కష్టతరంగా మారింది. అదే విధంగా టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లకు కూడా అభిమానులు స్టేడియానికి వస్తారో రారో అనే అనుమానాన్ని పీసీబీ టెన్షన్ పడుతోంది. ఈ తాజా పరిణామాలు భవిష్యత్ లో పాక్ క్రికెట్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. గత ఏడాది గ్యారీ కిర్‌స్టెన్‌ రాజీనామా చేయడం వల్ల అకిబ్‌ను.. పాక్‌ పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్‌ గా నియమించడం జరిగింది. కానీ ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్ విఫలమైన నేపథ్యంలో అకీబ్ ను తొలిగించేందుకు సిద్ధమయ్యారట.

ఇక అన్నింటికీ మించి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓ చెత్త రికార్డుని మూటకట్టుకుంది. ఈ ట్రోఫీలో పాల్గొన్న ప్రతీదేశం సెంచరీల మోత మోగించిన సంగతి తెలిసిందే. అయితే పాక్ మాత్రం ఆడిన రెండు మ్యాచులలో కూడా ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయడం జరగలేదు. దాంతో సోషల్ మీడియా జనాలు పాకిస్థాన్ క్రికెట్ జట్టుని ఓ రేంజులో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన బాంగ్లాదేశ్ పైన అయినా సెంచరీ చేస్తారా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవును.. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 29 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్.. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఓటమికి ఒకరినొకరు నిందించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: