
నిన్న (బుధవారం) అఫ్గానిస్తాన్ Vs ఇంగ్లండ్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఘన విజయం నమోదు చేసింది. 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ వీర బాదుడుకి తెర లేపింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీం జద్రాన్ ఇరగదీసాడు. 146 బంతుల్లో 177 పరుగులు చేసి స్టేడియంలో అట్రాక్షన్‌గా నిలిచాడు. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన జద్రాన్ ఈ అద్భుతాన్ని సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మొదట్లో అఫ్గాన్ కాస్త తడబడినప్పటికీ జద్రాన్ తన బ్యాటింగ్ తో అఫ్గాన్ కి ఊపిరి పోసాడు. గ్రౌండ్‌లో పరుగుల వరద పారించిన ఓపెనర్ జద్రాన్ ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. శతకానికి పైగా పరుగులు సాధించడంతో... ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ (40), ఒమర్జాయ్ (41) కూడా రాణించారు. 106 బంతుల్లో సెంచరీ చేసిన ఇబ్రహీం ఆ తర్వాత స్పీడు పించి మరో 40 బంతుల్లో 77 పరుగులు చేసి అఫ్గాన్‌కు భారీ స్కోరు అందించాడు. ఇకపోతే ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (177) చేసి భారత క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ రికార్డులను కూడా బద్దలు కొట్టడం కొసమెరుపు.