
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇది చావో రేవో తేల్చుకునే మ్యాచ్ కావడంతో బ్యాటింగ్ కు దిగింది. కానీ, ఆరంభంలోనే 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జద్రాన్ అసలు సిసలు పోరాటం మొదలుపెట్టాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో (40) కలిసి 103 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. ఆ తర్వాత మహ్మద్ నబీ (24 బంతుల్లో 40) మెరుపులు మెరిపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. జద్రాన్ ఏకంగా 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మహ్మద్ నబీ.. డేంజరస్ బ్యాటర్ జేమీ స్మిత్‌ను (9) ఔట్ చేసి ఇంగ్లీష్ శిబిరంలో కలకలం రేపాడు. బెన్ డకెట్ (38), జో రూట్ కాసేపు నిలబడి 68 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పినా, రషీద్ ఖాన్ దెబ్బకు డకెట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (25) కూడా తేలికైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ జోస్ బట్లర్ (38) పోరాటం కూడా టాప్ ఎడ్జ్‌తో ముగిసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. జో రూట్ మాత్రం మొక్కవోని దీక్షతో క్రీజులో నిలబడి దాదాపు ఐదేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ సాధించాడు.
చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 13 పరుగులు కావాలి. కానీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఆదిల్ రషీద్‌ను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. 2023 ప్రపంచ కప్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో వరుసగా రెండో వన్డేలో ఓడిపోయింది ఇంగ్లాండ్.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. రూట్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయిందని, టాప్ ఆర్డర్‌లో అతనికి సహకారం అందించే మరో బ్యాటర్ ఉంటే బాగుండేదని బట్లర్ మ్యాచ్ అనంతరం అభిప్రాయపడ్డాడు.