
ఇంకా నాకౌట్ దశలో కొన్ని మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక శతకాలు ఇవే కావడం ఇపుడు రికార్డ్ అని చెప్పుకోవాలి. గతాన్ని ఒకసారి పరిశీలిస్తే... 2002, 2017లో 10 సెంచరీల చొప్పున నమోదు కాగా... ఈ రికార్డు తాజాగా బద్దలైంది. అంతకుముందు 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 సెంచరీలు నమోదయ్యాయి.
ఇకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయానికి ఇబ్రహీం జద్రాన్ రికార్డు సెంచరీ అనేది ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఇక్కడ మరో ఆటగాడి గురించి చెప్పుకోవాలి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆల్ రౌండర్‌గా అస్మతుల్లా ఒమర్జాయ్ అసాధారణ ప్రదర్శన ఆఫ్ఘన్ జట్టు విజయానికి కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో ఒమర్జాయ్ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణించడం గమనార్హం. ఒమర్జాయ్ తన బౌలింగ్‌లో 59 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లలో జో రూట్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ వికెట్లను వరుసగా పడగొట్టాడు. అదే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో మ్యాచ్ గెలవడానికి సహాయపడింది.