మహేంద్రసింగ్ ధోనీ గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. భారత క్రికెట్ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే గనక అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ముందు వరుసలో నిలుస్తాడు. “కూల్ కెప్టెన్”గా పేరుగాంచిన ధోనీ తన అద్భుతమైన నాయకత్వంతో భారత జట్టుకు 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించడం వెనుక అతని అనితర సాధ్యమైన దీక్ష, పట్టుదల మెండుగా మనకి కనిపిస్తాయి. ఈ క్రమంలోనే అతడు ఒక సినిమా సెలిబ్రిటీ కంటే కూడా ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు. అంతేకాదండోయ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును 5 సార్లు విజేతగా నిలిపిన ఘటన ధోనీదే. అందుకే క్రికెట్లో అతని తెలివితేటలు, స్టంపింగ్ స్పీడ్, ఆటలో కూల్ మైండ్ సెట్ గురించి చెప్పుకుంటూ అభిమానులు పొంగిపోతూ ఉంటారు.

కాగా ఇప్పుడు 2025 ఐపీఎల్ కోసం ధోనీ మరలా సన్నద్ధమౌతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడు సీఎస్కే హోం టౌన్ చెన్నైకి చేరుకున్నాడు. ఇక చెన్నై చేరుకున్న అతడిని చెన్నై విమానాశ్రయంలో అభిమానులు పలకరించి, ఘన స్వాగతం పలికారు. విషయం ఏమిటంటే? చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఐపీఎల్ కోసం ట్రైనింగ్ క్యాంప్ ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం మహీ సహా కొంత మంది ఆటగాళ్లు ఈ క్యాంప్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంతో దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ధోనీ తన అనుభవాన్ని యువ ఆటగాళ్లకు పంచుతూ వారిలో నమ్మకం పెంచుతాడని సీఎస్కే అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2025 ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో తలపడనున్న సంగతి తెలిసే ఉంటుంది. కాగా ఈ సారి ధోనీ కేవలం మెంటార్ రోల్ లో ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ లో మొత్తం 5 ట్రోఫీలను గెలుచుకున్న సీఎస్కే, ఈసారి కూడా టైటిల్ గెలవాలనే కసితో ఉంది. ధోనీ ప్రత్యేకంగా తక్కువ బరువున్న బ్యాట్లను తయారు చేయించుకోవడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: