భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో సంచలనం సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను దాటేశాడు మన రోహిత్. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ఒక సిక్సర్ బాదడంతో గేల్ రికార్డు బ్రేక్ అయింది. వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మేజర్ ఐసీసీ టోర్నీల్లో ఇప్పుడు రోహిత్ పేరు మీదే సిక్సర్ల రికార్డు. ఈ సిక్స్‌తో రోహిత్ ఖాతాలో మొత్తం 65 సిక్సర్లు చేరాయి. గేల్ మాత్రం 64 సిక్సర్లతో రెండో స్థానానికి పడిపోయాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ భారీ స్కోర్ చేయలేకపోయాడు. 29 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఐసీసీ టోర్నీల్లో రోహిత్ ఓపెనర్‌గా వచ్చి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీల్లో 2,160 పరుగులు చేశాడు. అది కూడా 55.38 సగటుతో. ఇందులో 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పవర్ ప్లే ఓవర్లలో రోహిత్ దూకుడు చూస్తే బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. భారీ షాట్లు ఆడగల సత్తా ఉండటంతో టీమిండియాకు రోహిత్ చాలా కీలకం.

ఇన్నాళ్లూ ఈ రికార్డు తన పేరిట ఉన్న క్రిస్ గేల్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్ స్టార్ గేల్ ఐసీసీ వన్డే టోర్నీల్లో 51 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్సర్లు కొట్టాడు. మొత్తం 1,977 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.bఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 264 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీలతో రాణించారు.

ట్రావిస్ హెడ్ కూడా 33 బంతుల్లో 39 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో ఆస్ట్రేలియా 300 దాటేలా కనిపించింది. కానీ, కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్ వాళ్లను కట్టడి చేసింది. భారత్ ఛేదనను కాన్ఫిడెంట్‌గా మొదలుపెట్టింది. రోహిత్ మొదటి రెండు ఓవర్లలోనే ఫోర్, సిక్సర్ కొట్టాడు. మంచి టచ్‌లో కనిపించాడు కానీ, ఎనిమిదో ఓవర్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ కూపర్ కానల్లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ త్వరగా ఔటైనా భారత్ మాత్రం లక్ష్యంపైనే ఫోకస్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: