
మౌలానా షాహబుద్దీన్ రజ్వి బరేల్వి అనే మత గురువు షమీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "రోజా ఉండటం ఇస్లాంలో విధి. ఎవరైనా కావాలనే రోజాను వదిలేస్తే, వాళ్లు పాపం చేసినట్టే. షమీ రోజా ఉండకుండా మ్యాచ్ మధ్యలో జ్యూస్ తాగాడు. ఇది నేరం, దేవుడికి అతను సమాధానం చెప్పక తప్పదు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. షమీ చేసిన పనిని తప్పుబడుతూ కొందరు మత పెద్దలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహలి అనే మరో ముస్లిం పండితుడు షమీకి మద్దతుగా నిలిచారు. "ఖురాన్‌లో అల్లాహ్ స్పష్టంగా చెప్పాడు. ప్రయాణంలో ఉన్నవారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు రోజా ఉండాల్సిన అవసరం లేదు. షమీ టూర్ లో ఉన్నాడు కాబట్టి రోజాను వదిలేసే హక్కు అతనికి ఉంది. ఎవ్వరూ అతన్ని ప్రశ్నించకూడదు" అని ఆయన స్పష్టం చేశారు.
షమీ కుటుంబ సభ్యులు కూడా అతనికి అండగా నిలిచారు. షమీ కజిన్ ముంతాజ్ మాట్లాడుతూ.. "ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సిగ్గుచేటు. అతను దేశం కోసం ఆడుతున్నాడు. పాకిస్తాన్ క్రికెటర్లు కూడా ఆడుతున్నప్పుడు రోజా ఉండరు. మార్చి 9న జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌పై దృష్టి పెట్టమని షమీకి చెబుతాం. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని చెప్తాం" అని అన్నారు.
షమీ కోచ్ మహమ్మద్ బద్రుద్దీన్ కూడా షమీకి మద్దతుగా మాట్లాడారు. "షమీ ఏ తప్పు చేయలేదు. మత పెద్దలు దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి" అని ఆయన అన్నారు. "దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు" అని ఆయన చెప్పారు.
ఈ వివాదం క్రీడల్లో మతపరమైన ఆచారాలపై భిన్నాభిప్రాయాలను వెలుగులోకి తెచ్చింది. కానీ చాలా మంది షమీకి మద్దతుగా నిలిచారు. దేశం కోసం అతను చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు.