ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో, సౌతాఫ్రికా మరోసారి కీలక టోర్నీలో నిరాశపరిచింది. ఇది వారికి ఐదో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఓటమి. గతంలో 2000, 2002, 2006, 2013లలో కూడా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టారు. అంతేకాదు, 2023 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో, గతేడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లోనూ ఓడిపోయి కంటతడి పెట్టుకున్నారు.

1999 ప్రపంచ కప్ సెమీఫైనల్ లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్లింది. లాన్స్ క్లూసెనర్ ఊపుమీదున్నాడు. చివరి ఓవర్‌లో ఒక వికెట్ ఉండగా, గెలవడానికి ఒక పరుగు కావాలి. కానీ... నాలుగో బంతికి క్లూసెనర్, అలాన్ డోనాల్డ్ మధ్య సమన్వయ లోపం తలెత్తింది. డోనాల్డ్ క్రీజులోకి వచ్చేలోపే ఆడమ్ గిల్‌క్రిస్ట్ బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. స్కోర్లు సమయ్యాయి. గ్రూప్ దశలో సౌతాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాకు ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ ఓటమి.

2015 ప్రపంచ కప్ సెమీఫైనల్ విషయానికొస్తే అది  ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్. వర్షం కారణంగా 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ, న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. కానీ గ్రాంట్ ఇలియట్ అద్భుతంగా ఆడాడు. చివరి ఓవర్‌లో డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో 12 పరుగులు కావాలి. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా, ఇలియట్ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. సౌతాఫ్రికా ఓటమి, న్యూజిలాండ్ విజయం. స్టెయిన్ నిరాశతో కుప్పకూలిపోతే, ఇలియట్ మాత్రం 73 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి హీరో అయ్యాడు.

2023 ప్రపంచ కప్ సెమీఫైనల్: ఈసారి ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. లీగ్ దశలో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా, సెమీస్‌లో మాత్రం తేలిపోయింది. కోల్‌కతాలో మేఘావృతమైన వాతావరణంలో ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో, సౌతాఫ్రికా కేవలం 212 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. సౌతాఫ్రికా గట్టిగా పోరాడినా, ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచి, సౌతాఫ్రికా కలను చెరిపేసింది.

2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్: మరోసారి సౌతాఫ్రికా ఫైనల్ వరకు దూసుకొచ్చింది. ఈసారి కప్పు గెలుస్తుందని అందరూ ఆశించారు. కానీ... ఫైనల్‌లో భారత్‌తో మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా సునాయాసంగా గెలిచేలా కనిపించింది. 30 బంతుల్లో 30 పరుగులు కావాలి, చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఓటమి తర్వాత సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ, ప్రపంచ కప్ గెలిస్తేనే 'చోకర్స్' అనే ముద్ర పోతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: