ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వచ్చేసింది. ఆదివారం, మార్చి 9న జరగబోయే ఈ మ్యాచ్‌లో ఇండియా, న్యూజిలాండ్ మరోసారి కప్పు కోసం కొట్లాడబోతున్నారు. ఇది మామూలు మ్యాచ్ కాదు 25 ఏళ్ల నాటి పగ తీర్చుకునే సమయం. 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. అప్పుడు ఇండియా ఓడిపోయింది. ఇప్పుడు ‘రోహిత్ సేన’ ఆ చరిత్రను తిరగరాసే ఛాన్స్ కొట్టేసింది.

• 2000 నాటి గాయం, చేజారిన కప్పు కల

నైరోబీ, కెన్యాలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా ఓపెనర్లు గంగూలీ (117), టెండూల్కర్ (69) కలిసి దుమ్మురేపారు. 141 రన్స్ సాధించారు. సచిన్ అవుటయ్యాక, ద్రావిడ్ (22) వచ్చి గంగూలీతో కలిశాడు. వీళ్లిద్దరూ కలిసి ఇంకో 61 రన్స్ జోడించారు. 43 ఓవర్లు అయ్యేసరికి ఇండియా స్కోర్ 220/3. భారీ స్కోర్ ఖాయం అనుకున్నారు అందరూ.

కానీ మిడిల్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. యువరాజ్ సింగ్ (18), వినోద్ కాంబ్లీ (1), రాబిన్ సింగ్ (13) స్పీడ్ పెంచలేకపోయారు. లాస్ట్ 45 బాల్స్‌లో ఇండియా చేసింది కేవలం 44 రన్స్ మాత్రమే. మొత్తానికి 264/6 స్కోర్‌తో సరిపెట్టుకుంది. 265 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. వెంకటేష్ ప్రసాద్, అనిల్ కుంబ్లే దెబ్బకు రెండు వికెట్లు పోయాయి. 37/2 స్కోర్‌తో ఇండియా పైచేయి సాధించింది. కానీ ఆ తర్వాత నాథన్ ఆస్టిల్ (37), రోజర్ ట్వోస్ (31) కలిసి 45 రన్స్ పార్టనర్‌షిప్ కట్టారు. మళ్ళీ కుంబ్లే, ప్రసాద్ వీళ్ళను కూడా అవుట్ చేసి ఇండియాను రేసులో నిలిపారు.

సచిన్ టెండూల్కర్, క్రెయిగ్ మెక్‌మిలన్‌ (15)ను అవుట్ చేయడంతో మ్యాచ్ ఇండియా కంట్రోల్‌లోకి వచ్చినట్టే అనిపించింది. కానీ క్రిస్ కెయిన్స్ (102*) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. క్రిస్ హారిస్ (46) తో కలిసి ఆరో వికెట్‌కు 122 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. ఇండియన్ పేసర్లు అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ వికెట్లు తీయలేక చేతులెత్తేశారు. చివరికి న్యూజిలాండ్ రెండు బాల్స్ మిగిలి ఉండగానే 265/6 స్కోర్ చేసి గెలిచేసింది.

ఇండియా ఈ తప్పులు మళ్లీ చేయొద్దు..

2000 నాటి ఇండియన్ టీమ్ కంటే 2024 టీమ్ చాలా స్ట్రాంగ్. అప్పుడు టాప్ ఆర్డర్ కుప్పకూలితే మిడిల్ ఆర్డర్ తేల్చేసేది కాదు. కానీ ఇప్పుడు ఇండియా టీమ్‌లో 8 వరకు నమ్మకమైన బ్యాటర్లు ఉన్నారు. ఒకరిద్దరు ఫెయిల్ అయినా మిగతా వాళ్లు మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నోళ్లు. బౌలింగ్ కూడా ఇప్పుడు చాలా బలంగా ఉంది. కివీస్‌ను కట్టడి చేయడానికి ఇండియా నలుగురు స్పిన్నర్లపై నమ్మకం పెట్టుకుంది. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీఫైనల్ బెర్త్ కొట్టేసింది కూడా.

అయితే న్యూజిలాండ్ లాస్ట్ బాల్ వరకు పోరాడే టీమ్ అని అందరికీ తెలుసు. వాళ్లు ఎప్పుడూ వదిలిపెట్టరు, చరిత్రే సాక్ష్యం. ‘ఫైనల్ ఓటమి’ అనే బ్యాడ్ టాగ్ పోగొట్టుకోవాలంటే ఇండియా ఫుల్ ఫోకస్‌తో ఉండాలి. ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా జరగనివ్వకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: