న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్‌లు ఓడిపోయాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై విమర్శలు వెల్లువెత్తాయి. వాళ్లిద్దరూ జట్టుకు ఇక పనికిరారని చాలా మంది పెదవి విరిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరపడుతుండటంతో అంచనాలు పూర్తిగా పడిపోయాయి. వాళ్లిద్దరూ జట్టుకు భారమని కూడా అన్నారు. కానీ చివరకు ఫలితం చూస్తే, టీమిండియా గెలుపులో వాళ్లే కీలక పాత్ర పోషించారు.

రోహిత్ శర్మ కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపించాడు. బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫైనల్ వరకు పెద్దగా స్కోర్లు చేయకపోయినా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో అతను ఇచ్చిన మెరుపు ఆరంభాలు చాలా కీలకం అయ్యాయి. ఫైనల్‌లో కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడి ఇండియా విజయాన్ని ఖాయం చేశాడు. విరాట్ కోహ్లీ తన విమర్శకులకు గట్టి జవాబిచ్చాడు. పాకిస్థాన్‌తో సెంచరీ కొట్టడం టోర్నీకి టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌లో 84 పరుగులతో అదరగొట్టాడు.

భారత్ ఈ టోర్నీలోకి పక్కా ప్రణాళికతో అడుగుపెట్టింది. దుబాయ్ పిచ్‌ను క్షుణ్ణంగా స్టడీ చేసి ప్లేయర్లను ఎంపిక చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించారు. ఆ తర్వాత నలుగురికి పెంచారు. రెండో పేసర్‌ను తీసుకోకపోవడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్స్ చూస్తే ఆ వ్యూహం కరెక్ట్ అని తేలిపోయింది.

డెత్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్‌ను వాడటం కీలక వ్యూహం. బ్యాటింగ్‌లో కూడా ప్లాన్ క్లియర్‌గా ఉంది. రోహిత్ దూకుడుగా ఆడటం, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడటం, కోహ్లీ నిలకడగా ఉండటం, శ్రేయాస్ అయ్యర్ అవసరమైనప్పుడు అటాకింగ్ చేయడం.. ఇలా ఎవరి పాత్ర ఏమిటో స్పష్టంగా ఉంది. ఇక చివర్లో పరిస్థితిని బట్టి అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ఇండియాకు అసలు పరీక్ష ఎదురైంది. చాలా మంది ఫ్యాన్స్‌కు ఇండియా గెలుస్తుందా లేదా అనే అనుమానం ఉండే. కానీ బ్యాటింగ్ బలంగా ఉండటంతో భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి ఫైనల్‌కు దూసుకెళ్ళింది. ఈ గెలుపుతో ఫ్యాన్స్‌కు కప్పు కొడతామనే నమ్మకం కలిగింది. ఫైనల్‌లో న్యూజిలాండ్ గట్టిగా ఫైట్ చేసినా, ఇండియానే విజేతగా నిలిచింది.

వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో ఊహించని స్టార్. మొదటి రెండు మ్యాచ్‌లలో అతనికి ఛాన్స్ రాలేదు. కానీ సెమీఫైనల్ బెర్త్ ఖాయం అయ్యాక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తీసుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. సెమీఫైనల్‌లోనూ ఆస్ట్రేలియాపై రెండు కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇక ఫైనల్‌లో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్‌లను ఔట్ చేసి న్యూజిలాండ్ జోరుకు బ్రేక్ వేశాడు. అతని మిస్టరీ బౌలింగ్ ప్రత్యర్థులకు అంతుచిక్కకుండా పోయింది.

ఇండియా టీమ్ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడటం కలిసొచ్చింది. మిగతా టీమ్స్‌లా కాకుండా వీళ్ళు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకపోయింది. పిచ్, కండిషన్స్‌పై మంచి అవగాహన వచ్చింది. ఇది అడ్వాంటేజ్ అని కొన్ని టీమ్స్ విమర్శించినా, ఇది ఒక్కటే ఇండియా గెలవడానికి కారణం కాదు. ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ కూడా దుబాయ్‌లోనే ఆడింది, కానీ ఇండియాను ఓడించలేకపోయింది.

శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఈ టోర్నీలో తమ సత్తా ఏంటో నిరూపించారు. కొన్నేళ్ల క్రితం వరకు టీమ్‌లో వాళ్ళ స్థానాలు పర్మనెంట్ అనుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కీ ప్లేయర్స్ అయిపోయారు. శ్రేయాస్ మిడిల్ ఆర్డర్‌లో ఇంపార్టెంట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాకిస్తాన్‌పై 56, న్యూజిలాండ్‌పై 79 పరుగులు చేశాడు. సెమీఫైనల్‌లో 45, ఫైనల్‌లో 48 రన్స్ కొట్టాడు.

అక్షర్ పటేల్ బంతితో, బ్యాట్‌తో రెండిట్లోనూ ఇంప్రెస్ చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసి ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ లాస్ట్ మూడు మ్యాచ్‌లలో 42, 27, 29 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అనేది కేవలం ఒక్కరిద్దరి పెర్ఫార్మెన్స్‌తో వచ్చింది కాదు. ఇది స్మార్ట్ ప్లానింగ్, ధైర్యమైన నిర్ణయాలు, టీమ్‌వర్క్ ఫలితం. ప్రతి ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేశాడు. ఎక్స్‌పీరియన్స్, కొత్త టాలెంట్ సమంగా ఉండటం వల్లే ఈ టీమ్ పర్‌ఫెక్ట్ బ్యాలెన్స్‌తో ఉందని ప్రూవ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: