క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు సిద్ధమైంది. 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు జూన్ 11 నుంచి 15 వరకు లండన్‌లోని ఈ చారిత్రాత్మక స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్‌కు వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. లార్డ్స్‌లో ఈ మెగా మ్యాచ్ జరగడం గౌరవంగానే ఉన్నా, భారీ ఆర్థిక నష్టాన్ని కూడా తెచ్చిపెడుతోంది. ఎందుకంటే ఈ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించలేకపోయింది.

టైమ్స్ పత్రిక కథనం ప్రకారం, ఇండియా ఫైనల్‌కు రాకపోవడంతో లార్డ్స్ స్టేడియం నిర్వాహకులకు అక్షరాలా 4 మిలియన్ పౌండ్ల (మన కరెన్సీలో దాదాపు రూ.45 కోట్లు) నష్టం వాటిల్లుతుందని అంచనా. నిజానికి, ఫైనల్ మ్యాచ్‌కు టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఎందుకంటే భారత అభిమానులు భారీగా వస్తారని, టికెట్ల కోసం ఎగబడతారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇండియానే లేకపోవడంతో టికెట్ రేట్లు దారుణంగా తగ్గించాల్సి వచ్చింది. దీంతో మేనేజ్‌మెంట్ బాధ్యతలు చూసే మెర్ల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) భారీగా నష్టపోనుంది.

ఇండియా ఈసారి కూడా ఫైనల్‌కు వస్తుందని అందరూ గట్టిగా నమ్మారు. వరుసగా ఇది మూడోసారి అయ్యేది. కానీ అనూహ్యంగా టీమిండియా గత 8 టెస్టుల్లో ఏకంగా ఆరింట ఓడిపోయింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 0-3తో వైట్‌వాష్ అవ్వడం, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోవడం దెబ్బతీసింది. ఈ పరాజయాలతో ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి.

ఇండియా ఆడుతుందనే నమ్మకంతో లార్డ్స్ నిర్వాహకులు టికెట్ ధరలు పెంచేశారు. డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఎంత ధర పెట్టినా కొనేవాళ్లు ఉంటారని లెక్కలేసుకున్నారు. కానీ ఇండియానే లేకపోవడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఖాళీ స్టేడియం కంటే, తక్కువ ధరలైనా ఫర్వాలేదు.. స్టేడియం నిండాలి, సందడిగా ఉండాలి అనుకున్నారు. వెంటనే టికెట్ ధరలు తగ్గించేశారు. మొదట అనుకున్న ధరల కంటే దాదాపు 50 పౌండ్లు తగ్గించి, 40-90 పౌండ్ల మధ్య అమ్మకానికి పెట్టారు. ఈ ధరల తగ్గింపుతోనే 4 మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లింది.

గతంలో టికెట్ ధరలు మరీ ఎక్కువ పెట్టారని MCCపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి వాళ్ళు తమ ధరల విధానాన్ని మార్చుకున్నారు. ధరలు తగ్గించాక టికెట్లు కొన్న MCC సభ్యులకు డబ్బులు కూడా వెనక్కి ఇచ్చారు.

WTC ఫైనల్ అయిపోయాక, జూలై 10 నుంచి 14 వరకు ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ కూడా లార్డ్స్‌లోనే జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: