ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు చిన్న జట్ల ముందు కూడా తేలిపోతోంది. 1992లో వన్డే ప్రపంచ కప్, 2009లో టీ20 ప్రపంచ కప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన చరిత్ర ఉన్నా.. ఇప్పుడు సొంతగడ్డపై కూడా గెలవడం కష్టంగా మారింది.

గడిచిన రెండేళ్లలో పాక్ జట్టు ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్‍లా.. ఉందా లేదా అన్నట్టు పరిస్థితి. చిన్న జట్లయిన యూఎస్‌ఏ, జింబాబ్వే, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తున్నాయి. సొంతగడ్డపై జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

ఇంతకుముందు సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాతో జరిగిన ట్రై సిరీస్‌ను కూడా పాక్ కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్నా.. సీన్ ఏమీ మారలేదు. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పాక్ కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయింది. రెండో మ్యాచ్‌లో చేసిన స్కోరు 135 పరుగులు మాత్రమే. న్యూజిలాండ్ బ్యాటర్లు ఈ టార్గెట్లను ఈజీగా ఛేజ్ చేశారు. పాక్ బౌలింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

ప్రపంచ స్థాయి బౌలర్ అనుకుంటున్న షాహీన్ అఫ్రీదిని టిమ్ సీఫెర్ట్ ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు బాది ఊచకోత కోశాడు. పేసర్ మహ్మద్ అలీని కూడా ఫిన్ అలెన్ మూడు సిక్సర్లతో చితక్కొట్టాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, న్యూజిలాండ్ ఈ సిరీస్‌కు సెకండ్-టైర్ టీమ్‌ను పంపించింది. కానీ పాకిస్తాన్ మాత్రం బెస్ట్ టీమ్‌తోనే బరిలోకి దిగింది.

సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లాంటి వాళ్లు ఉండి ఉంటే ఈ అవమానాలు తప్పేవేమో. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. వాళ్లు లేకపోవడంతో పాకిస్థాన్ పతనం ఇక తప్పేలా లేదు.

2023 నుంచి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఓటమి పాలవ్వడంతో మొదలైన పతనం.. ఆ తర్వాత 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనే ఘోర పరాజయంతో మరింత ముదిరింది. ఆ వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి అభిమానుల్ని నిరాశపరిచింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం మరింత షాకిచ్చింది. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో టీ20 ఓటమి చవిచూసింది.

2024 టీ20 ప్రపంచ కప్‌లో ఏకంగా యూఎస్‌ఏ చేతిలోనే చిత్తుగా ఓడిపోయింది. ఆ టోర్నీలోనూ గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది. జింబాబ్వే లాంటి జట్టు పాకిస్థాన్‌ను వన్డేలు, టీ20ల్లో ఓడించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటి ముఖం పట్టేసింది పాకిస్థాన్.

2023 నుంచి చూసుకుంటే పాకిస్థాన్ 16 టీ20 మ్యాచ్‌లు ఆడితే గెలిచింది కేవలం 4 మ్యాచ్‌లే. అవి కూడా జింబాబ్వే, ఐర్లాండ్, కెనడా లాంటి బలహీన జట్లపైనే. ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ క్రికెట్‌ను దేవుడే కాపాడాలి. ఒకప్పుడు పులిలా గర్జించిన పాక్ జట్టు ఇప్పుడు పిల్లిలా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: