ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఐపీఎల్ 2025 సీజన్ ఘోరంగా మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ లెగ్ సైడ్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగ్గా ఆడకపోవడంతో బంతి నేరుగా మిడ్ వికెట్‌లో ఉన్న శివమ్ దూబే చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో దూబే సునాయాసంగా క్యాచ్ పట్టేశాడు.

ఈ డకౌట్‌తో రోహిత్ ఐపీఎల్ చరిత్రలో తన 18వ డక్‌ను నమోదు చేశాడు. తద్వారా ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్, భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్‌లతో కలిసి అత్యధిక డకౌట్ల చెత్త రికార్డును పంచుకున్నాడు.

* ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు సాధించిన ఆటగాళ్ల లిస్ట్‌:

18 - రోహిత్ శర్మ*
18 - గ్లెన్ మాక్స్‌వెల్
18 - దినేష్ కార్తీక్
16 - పియూష్ చావ్లా
16 - సునీల్ నరైన్

* CSK vs MI: మ్యాచ్ వివరాలు

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఐపీఎల్‌లోనే బిగ్గెస్ట్ రైవల్రీగా చెప్పుకునే.. క్రికెట్ అభిమానులు 'ఎల్ క్లాసికో' అని ముద్దుగా పిలుచుకునే మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ ఎలా ఉంటుందో చెప్పలేమని, అందుకే ఛేజింగ్‌కు వెళ్తున్నామని గైక్వాడ్ తెలిపాడు. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉందని, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, రచిన్ రవీంద్ర, సామ్ కర్రాన్ తమ నలుగురు విదేశీ ఆటగాళ్లని వెల్లడించాడు.

మరోవైపు ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ అందుబాటులో లేరు. పాండ్యా లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు. టాస్ సమయంలో సూర్యకుమార్ బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపించాడు. ప్రీ-మ్యాచ్ క్యాంప్‌లో తాము బాగా ప్రిపేర్ అయ్యామని ధీమా వ్యక్తం చేశాడు. రియాన్ రిక్లెటన్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్ తమ నలుగురు విదేశీ ఆటగాళ్లని కన్ఫర్మ్ చేశాడు.

ఐపీఎల్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీలుగా పేరు తెచ్చుకున్న ఈ రెండు జట్ల మధ్య మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: