
ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ కు ఓపెనింగ్ మ్యాచ్ లో ఓడిపోయే 'దరిద్రం' మళ్లీ వెంటాడింది. ఏకంగా 12 సీజన్లుగా ఇదే తంతు. 2013 నుంచి మొదలైన ఈ పీడకల ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పట్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై. అప్పుడు కెప్టెన్ రికీ పాంటింగ్. ఆ దెబ్బతో పాంటింగ్ కెప్టెన్సీ వదిలేశాడు. రోహిత్ శర్మ సారథ్యం చేపట్టాక ముంబై ఇండియన్స్ దశ తిరిగింది. అదే సీజన్‌లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను కొట్టింది.
ఐపీఎల్‌లో ఎన్ని విజయాలు సాధించినా, ముంబైకి మాత్రం తొలి మ్యాచ్ అంటేనే బెంగ. గత సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈసారి హార్దిక్ బ్యాన్ కారణంగా సూర్యకుమార్ యాదవ్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వచ్చినా ఫలితం మారలేదు. ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్ శాపం ఈసారి కూడా తప్పలేదు.
ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిచి చాన్నాళ్లైంది. చివరిసారిగా 2012లో గెలిచింది. అదీ కూడా చెన్నైలోని ఇదే చెపాక్ స్టేడియంలో. CSKపైనే 8 వికెట్ల తేడాతో దుమ్ము దులిపింది. అప్పుడు కెప్టెన్ హర్భజన్ సింగ్. ఈ 'సెంటిమెంట్' మొదలయ్యే ముందు ముంబై ఓపెనింగ్ మ్యాచ్‌లలో దుమ్మురేపింది. 2008 నుంచి 2012 వరకు ఆడిన తొలి 5 మ్యాచ్‌లలో 4 సార్లు గెలిచింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, CSK (రెండుసార్లు) జట్లపై విజయాలు సాధించింది.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఓడిపోయినా 5 సార్లు టైటిల్ కొట్టింది మరి ఈసారి కూడా అది నిజమవుతుందో లేదో చూడాలి.