ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. 210 పరుగుల కొండంత లక్ష్యం.. ఛేదనలో 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది DC. అక్కడ మ్యాచ్ అయిపోయిందనుకున్నారంతా. కానీ అశుతోష్ శర్మ అనే కుర్రాడు క్రీజులోకొచ్చి విధ్వంసం సృష్టించాడు.

కేవలం 31 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు కుమ్మేశాడు. చివరికి సిక్సర్ కొట్టి DCకి ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయాన్ని అందించాడు. ఫ్యాన్స్ అయితే షాక్‌లో ఉండిపోయారు. లక్నో బౌలర్లు మాత్రం మొదట్లో దుమ్మురేపారు. తొలి ఓవర్లోనే DC ఓపెనర్లను పెవిలియన్ చేర్చి 6/2తో గట్టి దెబ్బ కొట్టారు. కాస్త కుదురుకున్నాక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (29), అక్షర్ పటేల్ (22) కాసేపు మెరుపులు మెరిపించినా.. రెగ్యులర్ గా వికెట్లు పడుతూనే ఉన్నాయి. స్పిన్నర్లు దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్ లక్నోకి పట్టు బిగించేలా బౌలింగ్ చేశారు.

అయితే అశుతోష్ శర్మకు తోడు అరంగేట్ర ఆటగాడు విప్రాజ్ నిగమ్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నెంబర్ 8లో బ్యాటింగ్‌కు వచ్చిన నిగమ్.. కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. పవర్ హిట్టింగ్‌తో అశుతోష్ పై ఒత్తిడిని తగ్గించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో DC మళ్లీ రేసులోకి వచ్చింది.

బౌలింగ్‌లో 2 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చినా.. బ్యాటింగ్‌లో మాత్రం నిగమ్ తన మార్క్ చూపించాడు. భయం లేకుండా ఆడిన తీరుతో రాబోయే మ్యాచ్‌లలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నట్లే.

మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. అశుతోష్, స్టబ్స్, నిగమ్ భాగస్వామ్యాలే తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాయని ఒప్పుకున్నాడు. ఏది ఏమైనా ఓటమి రుచి చూసిన DC.. చివరికి గెలుపుతో దుమ్మురేపింది. ఈ విజయంలో అసలు కారణం మాత్రం అశుతోష్ శర్మనే.

మరింత సమాచారం తెలుసుకోండి: