
అయ్యర్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో అభిమానులు సంబరాలు షురూ చేశారు. చివరి ఓవర్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో సెంచరీ సాధించే అవకాశం దాదాపుగా చేజారింది. పవర్ గేమ్ కు ప్రాధాన్యతని ఇచ్చిన అయ్యర్, భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్ల గుండెల్లో గుబులు పుట్టించాడు. అసలు విషయంలోకి వెళితే... మరో ఎండ్ లో శశాంక్ సింగ్ అయితే తన సుడిగాలి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గత సీజన్ లో తన ఆట గాలివాటం కాదని నిరూపించుకుంటూ శశాంక్ సింగ్ రెచ్చిపోయాడనే చెప్పుకోవాలి. దాంతో టీమ్ ఇండియాకు మరో SKY దొరికేశాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ కనబడుతున్నాయి.
అవును, కేవలం 16 బంతుల్లోనే శశాంక్ సింగ్ 6 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 44 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అయితే శశాంక్ సింగ్ రెచ్చిపోయి మరీ ఆడడం జరిగింది. ఏకంగా 5 ఫోర్లు బాది ప్రత్యర్థులను హడలెత్తించాడు. ఆ ఓవర్ వేసింది మహ్మద్ సిరాజ్. అంతకుముందు, పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య దూకుడుగా ఆడి 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 47 పరుగులు చేయడం కొసమెరుపు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 16, మార్కస్ స్టొయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్ 3, రబాడా 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.