అవును, తాజా విక్టరీ ఆర్సీబీ జట్టుకి చాలా ప్రెస్టీజియస్ మ్యాచ్. ఎందుకంటే? దాదాపు 17 ఏళ్ల తర్వాత ఓ అద్భుతం జరిగింది కాబట్టి. వివరాల్లోకి వెళితే... ఆర్సీబీ ఐపీఎల్ మొదలైన కొత్తల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా వ్యవహరించేవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 17 ఏళ్ళ క్రితం మిస్టర్ వాల్ కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ గెలిచింది. ఆ తరువాత ప్రతీ ఏడాది ఐపీఎల్ జరుగుతూనే ఉంది. బెంగళూరు జట్టు చెన్నైలో మ్యాచ్ లు ఆడుతూనే ఉంది... కెప్టెన్లు కూడా మారుతూనే ఉన్నారు. కానీ ఆర్సీబీ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం చాలా బాధాకరం. ఆ బాధని ఎట్టకేలకు నిన్న రజత్ పాటీదార్ కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు బ్రేక్ చేసినట్టు అయింది.

అవును, చెన్నైలో చెన్నైని ఓడించి మరీ ఆర్సీబీ తనకి కొరకరాని కొయ్యలాగా మారిన సూపర్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డ మీద చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెక్ పెట్టింది. ఒక్కసారి గతానికి వెళితే... 2008 ఐపీఎల్‌ ఆరంభ సీజన్లో గెలిచాక అక్కడ ఆడిన ప్రతిసారీ ఆర్సీబీ ఓడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఫలితాన్ని మారుస్తూ ఓ కొత్త చరిత్ర సృష్టించింది. చెన్నై వెర్సస్ ఆర్సీబీ మ్యాచ్ అంటే సీఎస్కేనే గెలుస్తుంది... బెంగళూరు ఓడిపోతుంది అన్న నానుడిని తుడిచేసింది. అవును, తాజాగా చెన్నై మీద ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

చెపాక్ లో తాజాగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 197 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే ముందు ఉంచింది. సీఎస్కే జట్టులో అందరూ మంచి బ్యాటర్లే ఉండడంతో కచ్చితంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ, అంచనాలు తారుమారు అయ్యాయి. హేజిల్‌వుడ్‌ తన తొలి ఓవర్లోనే త్రిపాఠి (5), రుతురాజ్‌ (0)లను ఔట్‌ చేయడంతో చెన్నైకి చెక్‌ పెట్టినట్టు అయింది. దీపక్‌ హుడా (4), సామ్‌ కరన్‌ (8) అందరూ కేవలం సింగిల్ డిజిట్లకే పరిమితం అయ్యారు. రచిన్ రవీంద్ర మాత్రమే వికెట్ ను కాపాడుకుంటూ వచ్చాడు. చివర్లో ధోనీ వచ్చి 3 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టినా... ఫలితం లేకుండా పోయింది. రాయల్ ఛాలెంజర్స్ జట్టులోని బౌలర్లు విజృంభించేశారనే చెప్పుకోవాలి. హేజిల్‌వుడ్‌ (3/21), యశ్‌ దయాళ్‌ (2/18), లివింగ్‌స్టన్‌ (2/28) సత్తా చాటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RCB