సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ సంచలన హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)తో టికెట్ల పంపిణీ విషయంలో తలెత్తిన తీవ్ర వివాదం కారణంగా, ఐపీఎల్ 2025 సీజన్‌లో తమ సొంత మైదానమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్)లో ఆడబోమని, మ్యాచ్‌లను వేరే వేదికకు తరలిస్తామని SRH తేల్చి చెప్పింది. HCA, ముఖ్యంగా దాని అధ్యక్షుడు ఎ. జగన్ మోహన్ రావు, తమను వేధిస్తున్నారని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని SRH తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది.

నేషనల్ మీడియా కథనం ప్రకారం, SRH జనరల్ మేనేజర్ శ్రీనాథ్ టీబీ ఈ మొత్తం వ్యవహారంపై HCA కోశాధికారి సీజే శ్రీనివాస్ రావుకు ఘాటుగా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో, "ఒకవేళ మా మ్యాచ్‌లు మీ స్టేడియంలో జరగడం HCAకు ఇష్టం లేకపోతే, దయచేసి ఆ విషయాన్ని మాకు రాతపూర్వకంగా తెలియజేయండి. మేం వెంటనే ఈ విషయాన్ని బీసీసీఐకి, తెలంగాణ ప్రభుత్వానికి, మా యాజమాన్యానికి తెలియజేసి, మా మ్యాచ్‌లను మరో వేదికకు షిఫ్ట్ చేసుకుంటాం" అని శ్రీనాథ్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.

గత 12 ఏళ్లుగా HCAతో తమకు ఎలాంటి పెద్ద సమస్యలు రాలేదని, ఇరు పక్షాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయని SRH గుర్తుచేసింది. అయితే, గత సీజన్ నుంచి HCA వైఖరిలో మార్పు వచ్చిందని, అప్పటి నుంచి నిరంతరం ఏదో ఒక రూపంలో ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారని SRH ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ గొడవకు అసలు కారణం ఏంటంటే.. కాంప్లిమెంటరీ (ఉచిత) టికెట్లు. ఒప్పందం ప్రకారం, SRH ప్రతి మ్యాచ్‌కు HCAకు 3,900 ఉచిత టికెట్లను అందజేస్తోంది. ఇందులో భాగంగా F12A బాక్స్‌లోని 50 సీట్లు కూడా ఉంటాయి. అయితే, HCA ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చింది. ఆ బాక్స్‌లో కేవలం 30 సీట్లే సరిపోతాయని, కాబట్టి మిగిలిన 20 సీట్లకు బదులుగా మరో బాక్స్‌లో అదనంగా 20 ఉచిత టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది.

ఈ వివాదం మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తారాస్థాయికి చేరింది. SRH యాజమాన్యం అదనపు 20 టికెట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో, HCA అధికారులు ఏకంగా f3 బాక్స్‌కు తాళం వేసేశారు. ఐపీఎల్ సమయంలో తాము పూర్తి స్టేడియాన్ని అద్దెకు తీసుకుంటామని, ఇలా బాక్సులకు తాళాలు వేయడం సరికాదని SRH తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత రెండు సీజన్లుగా HCA తమను ఇలా పదేపదే వేధిస్తోందని మండిపడింది.

ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనేందుకు HCA అపెక్స్ కౌన్సిల్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని SRH కోరింది. దీనిపై HCA అధ్యక్షుడు మోహన్ స్పందిస్తూ, చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని మీడియాకు తెలిపారు. కాగా, SRH తమ తదుపరి హోమ్ మ్యాచ్‌ను ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్ తో ఇదే ఉప్పల్ స్టేడియంలో ఆడాల్సి ఉంది. మరి ఈలోగా వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: