ముంబై ఇండియన్స్ యువ పేసర్ సత్యనారాయణ రాజు, ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నమ్మశక్యం కాని ఒక స్లో డెలివరీతో అందరినీ షాక్‌కు గురిచేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ 25 ఏళ్ల బౌలర్ 13వ ఓవర్లో గుజరాత్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌ను తన బ్యాక్-ఆఫ్-ది-హ్యాండ్ వేరియేషన్‌తో ఆశ్చర్యపరిచాడు.

ఆ డెలివరీ ఎంత నెమ్మదిగా వచ్చిందంటే, స్పీడ్ గన్ కూడా దాని వేగాన్ని కనీసం నమోదు చేయలేకపోయింది. ఆ ఓవర్లోని మిగతా బంతుల్లా కాకుండా ఇది చాలా స్లో. బంతి గాలిలో చాలా సేపు తేలియాడుతూ వస్తున్నట్లు అనిపించడంతో, బట్లర్‌కి తన స్టాన్స్‌ని మార్చుకోవడానికి బోలెడంత సమయం దొరికింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ చాలా కూల్‌గా పొజిషన్ తీసుకుని, దానిని బౌండరీకి పుల్ చేశాడు. షార్ట్ బాల్‌గా వేయాలనుకున్న ఆ బంతికి బట్లర్‌ను ఇబ్బంది పెట్టేంత వేగం లేకపోవడంతో, ఫోర్ కొట్టడం చాలా ఈజీ అయిపోయింది.

సోషల్ మీడియాలో అభిమానులు రాజు వేసిన ఈ స్లో బాల్‌ను చూసి, ఒకప్పుడు వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రావో వేసిన స్లో బాల్ మాయాజాలంతో పోల్చారు. బ్రావో ఇలాంటి వేరియేషన్స్‌కి పెట్టింది పేరన్న సంగతి తెలిసిందే.

రాజు మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచి గుజరాత్ మ్యాచ్‌ కోసం జట్టులో కొనసాగించింది.

ఈ మ్యాచ్‌కు ముందు, రాజు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మతో మాట్లాడటం కనిపించింది. రోహిత్ అతనికి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాడు. ఇక హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత, రోహిత్ మరోసారి ఈ యువ బౌలర్‌తో మాట్లాడి ధైర్యం నూరిపోశాడు.

గుజరాత్ మ్యాచ్‌లో రాజు బౌలింగ్ మొదట్లో కాస్త తడబడింది. తన మొదటి ఓవర్లో 13 పరుగులు సమర్పించుకున్నాడు. అతన్ని మళ్లీ డెత్ ఓవర్లలో బౌలింగ్‌కు తీసుకురాగా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ అతని స్లో బాల్స్‌ను సిక్సర్లుగా మలచడంతో ఆ ఓవర్లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి.

అయితే, రాజు చివరి ఓవర్లో అద్భుతంగా పుంజుకున్నాడు. రషీద్ ఖాన్ ఒక సిక్స్ కొట్టినా, ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా తన నరాలను అదుపులో ఉంచుకుని, ప్రమాదకర ఆఫ్ఘన్ ఆల్-రౌండర్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి కాస్త పర్వాలేదనిపించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రాజు 3 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు, ముంబై ఇండియన్స్ జట్టు ఒక ఆశ్చర్యకరమైన మార్పు చేసింది. CSKతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లతో అదరగొట్టిన విఘ్నేష్ పుథూర్‌ను ఈ మ్యాచ్‌లో పక్కన పెట్టింది. కేరళకు చెందిన ఈ లెగ్-స్పిన్నర్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైనట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: