అవును.. నిజమే. ఇది మొత్తం ఐపీఎల్ లోనే కనీవినీ ఎరుగని దృశ్యం అని కొనియాడుతున్నారు విశ్లేషకులు. SRH vs KKR మ్యాచ్‌లో 'కమిండు మెండిస్' కనబరిచిన ద్వంద్వ బౌలింగ్ నైపుణ్యమే దానికి ఓ చక్కటి ఉదాహరణ. అవును, కమిండు మెండిస్ తనదైన ఓ ప్రత్యేక నైపుణ్యంతో బౌలింగ్ చేసి అందరినీ అవాక్కయేలా చేసాడు. ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేసి, KKR బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ వికెట్‌ను తీసి స్పెషల్ ఫీట్ సాధించాడు. SRH బౌలర్లు మంచి ప్రయత్నం చేసినప్పటికీ, KKR చివరి ఓవర్లలో విరుచుకుపడి భారీ స్కోరు బాదింది.

కమిండు మెండిస్ క్రికెట్‌ ప్రపంచంలోనే ఇపుడు అరుదైన ఆటగాడిగా పేరుగాంచాడు. శ్రీలంకకు చెందిన ఈ ఆల్‌రౌండర్ రెండు చేతులతోనూ బౌలింగ్ చేసి వారెవ్వా అనిపించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఒకే ఓవర్లో ఎడమచేతితోనూ, కుడిచేతితోనూ బౌలింగ్ చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరిచాడు.ఇది అతనికి మొదటి మ్యాచ్ అయినప్పటికీ, అతను ఇప్పటికే శ్రీలంక తరఫున 12 టెస్టులు, 19 వన్డేలు, 23 T20I మ్యాచ్‌లు ఆడడం గమనార్హం. ఇక అతని అరుదైన బౌలింగ్ నైపుణ్యాన్ని చూసిన తర్వాత, IPL అధికారిక X (ట్విట్టర్) ఖాతా “గందరగోళంగా ఉందా?” అంటూ సరదాగా స్పందించడం విశేషం.

IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2025లో జరిగిన 15వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ SRHతో భారీ స్కోరు నమోదు చేసుకుంది. చివరి ఓవర్లలో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం వలన KKR 20 ఓవర్లలో 200/6 స్కోరు సాధించగలిగింది. తొలి 3 ఓవర్లలోనే KKR 17/2కి కూలబడింది. ఓపెనర్లు సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ ఫెయిల్ కావడం వలన జట్టు ఒత్తిడిని ఎదుర్కొంది. డి కాక్ 6 బంతుల్లో కేవలం 1 పరుగే చేసి పాట్ కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. సునీల్ నరైన్ 7 బంతుల్లో 7 పరుగులకే మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో కెప్టెన్ అజింక్య రహానే, యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నంలో స్మార్ట్ షాట్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL