లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ వికెట్ తీసిన సంబరాలు వివాదాస్పదంగా మారాయి. నమన్ ధీర్‌ను ఔట్ చేసిన తర్వాత రాఠీ "నోట్‌బుక్‌లో రాసుకునే" సైగ చేశాడు. ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించడమేనని తేల్చిన మ్యాచ్ రిఫరీ అతనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కూడా ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇలాంటి తప్పు చేయడం ఇది రెండోసారి కావడంతో రాఠీకి గట్టి షాక్ తగిలింది.

అసలు విషయానికొస్తే.. రాఠీ ఇలా సంబరాలు చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఈ సీజన్‌లోనే ఏప్రిల్ 1న ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసినప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేశాడు. అప్పుడు కాస్త బాడీ టచ్ కూడా ఉండటంతో మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేసి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చాడు. ఈసారి మాత్రం బ్యాటర్‌కు దగ్గరగా వెళ్లకపోయినా.. ఇది రిపీట్ అఫెన్స్ కావడంతో శిక్షను డబుల్ చేశారు.

ఇంతకీ ఆర్టికల్ 2.5 ఏం చెబుతుందంటే.. బ్యాటర్ ఔటైన తర్వాత అతన్ని రెచ్చగొట్టేలా, అవమానించేలా లేదా కించపరిచేలా సంజ్ఞలు చేయడం లేదా భాషను ఉపయోగించడం నేరం. ఎదుటి ఆటగాడు రియాక్ట్ అవ్వకపోయినా ఇది తప్పేనట.

మొదటిసారి ఫైన్ వేసినప్పుడే మ్యాచ్ అధికారులు రాఠీకి ఈ రూల్ గురించి క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారట. కానీ రాఠీ మాత్రం తన మునుపటి శిక్ష సంబరాల్లో బ్యాటర్‌కు దగ్గరగా వెళ్లడం వల్ల వచ్చిందని అనుకున్నాడట. నోట్‌బుక్ సైగ కూడా తప్పని అతను అస్సలు ఊహించలేదట. పాపం అమాయకుడు.

ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్ రాఠీకి ఇదే తొలి ఐపీఎల్ సీజన్. విచిత్రం ఏంటంటే.. బౌలింగ్‌లో అదరగొట్టిన రాఠీకి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు కూడా వచ్చింది. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఎకానమీ రేటు కూడా జస్ట్ 5.25 మాత్రమే. లక్నో టీమ్‌లో మిగతా బౌలర్లందరూ 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇవ్వడం గమనార్హం.

మరోవైపు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు కూడా భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి రూ. 12 లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడిన మూడో కెప్టెన్ పంత్. ఇంతకుముందు హార్దిక్ పాండ్యా (ముంబై), రియాన్ పరాగ్ (రాజస్థాన్) కూడా ఈ లిస్టులో చేరారు.

ఐపీఎల్ రూల్స్ ప్రకారం, నాలుగు డీమెరిట్ పాయింట్లు ఒక సస్పెన్షన్ పాయింట్‌తో సమానం. ఒక సస్పెన్షన్ పాయింట్ వస్తే, ఆ ఆటగాడు ఒక మ్యాచ్ ఆడటానికి వీలుండదు. డీమెరిట్ పాయింట్లు 36 నెలల పాటు రికార్డులో ఉంటాయి. ప్రస్తుతం రాఠీకి మూడు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. అంటే ఇంకో తప్పు చేస్తే మాత్రం బ్యాన్ పక్కా. ఇంకోసారి ఇలాంటి పనులు చేయాలంటే రాఠీ కాస్త ఆలోచించుకోవాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: