
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ధోనీ మొత్తం 55 బంతులు ఆడి 76 పరుగులు చేశాడు. అందులో అత్యధిక స్కోరు 30 పరుగులు మాత్రమే. ధోనీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, రిటైర్మెంట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ పాత పాడ్‌కాస్ట్ వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది.
ఆ పాడ్‌కాస్ట్‌లో ధోనీ రిటైర్మెంట్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "ఇప్పుడే రిటైర్ అవుతారా?" అని అడిగిన ప్రశ్నకు ధోనీ లేదు అని సమాధానమిచ్చాడు. "నేను చాలా సింపుల్‌గా ఆలోచిస్తున్నాను. నేను ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాను. ప్రస్తుతం ఏమి చేయాలో దానిపైనే దృష్టి పెట్టాను" అని చెప్పాడు.
"నేను ప్రతీ సంవత్సరం గురించి విడివిడిగా ఆలోచిస్తాను. నాకు ఇప్పుడు 43 ఏళ్లు, ఐపీఎల్ ముగిసే జులైకి 44 వస్తాయి. అప్పుడు నాకు మరో ఏడాది ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి 10 నెలల సమయం ఉంటుంది" అని ధోనీ చెప్పుకొచ్చాడు.
"నేను నిర్ణయించుకోవడం కాదు, నా శరీరం సహకరిస్తుందా లేదా అనేది చెబుతుంది. అందుకే ప్రతీ సంవత్సరం చూసుకుంటూ, ప్రస్తుతం ఏమి చేయాలో దానిపైనే పూర్తిగా దృష్టి పెడతాను" అని ధోనీ అన్నాడు.
ధోనీ రిటైర్మెంట్ రూమర్లపై సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా స్పందించాడు. "లేదు, ఆ పుకార్లకు నేను ఫుల్‌స్టాప్ పెట్టలేను. నాకు నిజంగా ఐడియా లేదు. నేను ధోనీతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. అతను ఇంకా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. నేను ఈ రోజుల్లో అతని రిటైర్మెంట్ గురించి అడగను కూడా. మీరే కదా ఎప్పుడూ అడుగుతారు" అంటూ ఫ్లెమింగ్ మీడియాకు చెప్పాడు.
ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ అంశంపై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ 2023లోనే ఐపీఎల్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే బాగుండేదని తివారీ అభిప్రాయపడ్డాడు.
క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ తివారీ ఏమన్నాడంటే.. "నా అభిప్రాయం ప్రకారం, ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడానికి సరైన సమయం 2023, ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన వెంటనే. అప్పుడే రిటైర్మెంట్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎక్కడో నాకు అనిపిస్తుంది, ధోనీ క్రికెట్ ద్వారా సంపాదించిన పేరు, ప్రఖ్యాతలు, గౌరవం అన్నీ ఉన్నప్పటికీ.. గత రెండేళ్లుగా అతను ఆడుతున్న తీరులో అభిమానులు ఆ స్పార్క్, ఆ మ్యాజిక్ ను చూడలేకపోతున్నారు. ముఖ్యంగా చెన్నై అభిమానుల గుండెల్లో అతను సంపాదించుకున్న నమ్మకం ఇప్పుడు సన్నగిల్లుతున్నట్లు అనిపిస్తుంది" అంటూ మనోజ్ తివారీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.