
"మళ్లీ ఎవరి ఆట చూడాలని ఉంది?" అని అడిగితే.. వెంటనే నలుగురు దిగ్గజాల పేర్లు చెప్పేశారు ధోనీ. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్.. ఒకప్పుడు టీమిండియాలో ధోనీతో కలిసి ఆడిన వాళ్లే వీళ్లంతా.
"నాకు ఇండియన్ ప్లేయర్స్ ఆట చూడడమంటేనే ఇష్టం. వీరూ పా (సెహ్వాగ్) ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉంది. ఆ తర్వాత సచిన్, దాదా (గంగూలీ)... వాళ్లంతా పీక్ ఫామ్‌లో ఉంటే చూడాలని ఉంది" అని తన మనసులోని మాటను బయటపెట్టారు ధోని.
వాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత అని, వాళ్ల ప్రైమ్ టైమ్‌లో వాళ్లను చూస్తే ఇక వేరే ఏదీ వద్దనిపించేదని అన్నారు. క్రికెట్‌లో గెలుపు ఓటములు సహజం, ఎవరితో ఎవరినీ పోల్చలేం కానీ.. చిన్నప్పుడు వీళ్లే మాకు హీరోలని చెప్పుకొచ్చారు ధోని.
ఇంకా 2007 t20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్‌పై ఆరు సిక్స్‌లు కొట్టిన మూమెంట్‌ను గుర్తు చేసుకున్నారు. "యువీ సిక్స్‌లు కొడుతుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అప్పుడు ఇంకెవరున్నా పట్టించుకోలేదు" అని ఆనాటి రోజుల్ని నెమరువేసుకున్నారు.
"వీళ్లంతా మ్యాచ్ విన్నర్లు. ఇండియా ఎన్నో మ్యాచ్‌లు, టోర్నమెంట్లు గెలవడానికి కారణం వాళ్లే. అందుకే ఒక్కరిని కాదు, వాళ్లందరినీ మళ్ళీ కలిసి ఆడటం చూడాలని ఉంది" అని తన అభిమానాన్ని చాటుకున్నారు ధోని.