
టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.. లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, లక్నో ఓపెనర్లు ఐడెన్ మార్క్‌రమ్ (28 బంతుల్లో 47), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81) ఆ నిర్ణయం సరైంది కాదని నిరూపిస్తూ కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 62 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లక్నోకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
మార్క్‌రమ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్.. ఆ తర్వాత అసలు సిసలైన విధ్వంసం సృష్టించాడు. మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కు కేవలం 30 బంతుల్లోనే 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పూరన్ ఆరంభం నుంచే సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తం 36 బంతులు ఎదుర్కొని, 8 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో లక్నో స్కోరు 238 పరుగులకు చేరింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు తీసినా, 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా కాస్త పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కలేదు.
ఇక 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత నరైన్‌తో జతకట్టిన కెప్టెన్ రహానే కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 23 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. పవర్‌ప్లే ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 90 పరుగులు చేసి, లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్లే కనిపించింది.
అయితే, 13వ ఓవర్‌లో రహానే ఔటవ్వడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ తడబడింది. కీలక సమయంలో ఆండ్రీ రస్సెల్ కంటే ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన రమణ్‌దీప్ సింగ్ (1), అంగ్‌క్రిష్ రఘువంశీ (5) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. దీంతో కేకేఆర్ మిడిలార్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. లక్నో బౌలర్లు శార్దూల్ ఠాకూర్ (2/52), దిగ్వేశ్ రాఠీ (1/33), రవి బిష్ణోయ్ (1/47) కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. ఒంటరి పోరాటం చేసిన రింకూ సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉన్నాడు.
చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి పరుగులు అవసరం కాగా, క్రీజులో రింకూ సింగ్, హర్షిత్ రాణా ఉన్నారు. చివరి ఓవర్ తొలి బంతిని ఎదుర్కొన్న రాణా ఫోర్ కొట్టి ఆశలు రేపినా, తర్వాతి బంతికి భారీ షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు. చివరి మూడు బంతులను ఎదుర్కొన్న రింకూ సింగ్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదినా.. కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో ఊహించని రీతిలో పోరాడిన కోల్‌కతా కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలై, అభిమానులను నిరాశపరిచింది. లక్నో శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.