ఇపుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా... పంజాబ్ కింగ్స్ యువ క్రికెటర్ ప్రియాంష్ ఆర్య సునామీ ఇన్నింగ్స్ ఆట గురించే మాట్లాడుకుంటున్నారు. అవును! ప్రియాంష్ ఆర్య‌.. మరోసారి తనదైన దుమ్మురేపే బ్యాటింగ్ తో  దిగ్గ‌జ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నాడు. వ‌రుస‌గా ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ ముల్ల‌న్ పూర్ లో ప‌రుగుల వర్షం కురిపించాడు. ఐపీఎల్ హిస్ట‌రీలో 4వ ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టి అందరినీ అవాక్కయేలా చేశాడు. దేశ‌వాళీ క్రికెట్లో 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు బాది, సంచ‌న‌ల రేపిన ప్రియాంష్ ఆర్య‌.. ఐపీఎల్ పంజాబ్ కింగ్ త‌ర‌ఫున ఆడుతూ, చెన్నై సూప‌ర్ కింగ్స్ పై హ్యాట్రిక్ ఫోర్లు, సిక్స‌ర్లతో మరోసారి తనదైన ఆటతీరుని కనబరిచాడు.

మథీషా పతిరానా బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు (6,6,6,4=23) కొట్టి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించాడు. 39 బంతుల్లోనే త‌న తొలి ఐపీఎల్ సెంచ‌రీని పూర్తి చేయడంతో ప్రియాంష్ ఆర్య టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు. అయితే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ నాల్గో సెంచ‌రీ ఇదే కావ‌డం విశేషం. అత‌ని కంటే ముందు గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) మాత్రమే ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీలు చేసిన ఘనత సాధించారు. అదే సమయంలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన రెండో భారతీయుడిగా ప్రియాంష్ ఆర్య నిలవడం గ్రేట్ అనే చెప్పుకోవాలి.

IPL ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 22వ మ్యాచ్ లో PBKS (పంజాబ్ కింగ్స్) - చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా... టాస్ గెలిచిన పంజాబ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో దూకుడుగా బ్యాటింగ్ ను మొదలుపెట్టింది. కానీ, వరుసగా వికెట్లను కోల్పోయింది. సరిగ్గా అదే సమయంలో ఆట మొదలు పెట్టాడు యంగ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య. తన స్టైల్ లో బ్యాటింగ్ చేసి అదిరిపోయే సెంచరీ కొట్టాడు. కట్ చేస్తే, పంజాబ్ టీమ్ భారీ స్కోర్ సాధించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన ప్రియాంశ్ ఆర్య కేవలం 19 బంతుల్లోనే తన మొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈ నేపథ్యంలో 5 ఫోర్లు,  4 సిక్సర్లు బాదాడు. అంతటితో అతని దూకుడు ఆగలేదు. వచ్చిన చెన్నై బౌలర్లందరినీ చెగుడుగు ఆడుకుంటూ వరుసగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. 39 బంతుల్లో తొలి ఐపీఎల్ సెంచరీని సాధించి సరికొత్త రికార్డుల్ని నెలకొల్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: