ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 25 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంతమాత్రమూ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. వరుస పరాజయాలు మూటకట్టుకోవడంతో సర్వత్రా విమర్శల పాలైంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడితే అందులో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. మిగిలిన 4 మ్యాచ్ ల్లో కూడా ఘోర పరాజయం పాలయ్యింది. దాంతో సన్ రైజర్స్ ప్రదర్శనతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అవును... సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మునుపటి పదును కరువయ్యింది. గత సీజన్లో ఇరగదీసిన ఈ జట్టు నేడు కుదేలయింది అనడంలో అతిశయోక్తి లేదు.

గత నెలలో సరిగ్గా ఉగాది రోజు డీసీ (ఢిల్లీ కేపిటల్స్)పై ఓటమిని చవిచూసిన SRH (సన్ రైజర్స్ హైదరాబాద్), ఈ నెల శ్రీరామనవమి రోజున GT (గుజరాత్ టైటాన్స్)పై దారుణంగా ఓడిపోయింది. రెండు పండగ రోజుల్లో కూడా ఓటమిని చవిచూడడంతో సోషల్ మీడియాలో అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేసి తమ బాధని తెలియజేస్తున్నారు. మరోవైపు ఈనెల 12న 'హనుమజ్జయంతి' రోజు PBKS (పంజాబ్ కింగ్స్)తో పోరాడనుంది. దాంతో ఆంజనేయుడి ఆశీస్సులైనా ఈసారి సన్రైజర్స్ ని గట్టెక్కించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

ఇకపోతే... ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు పేలవ ప్రదర్శన చూపుతున్నారు. ఆశలు పెట్టుకున్న హెన్రిచ్ క్లాసెన్ భారీ ఇన్నింగ్స్ లు ఆడే పరిస్థితి ఏర్పడడం లేదు. ఆరంభాలు బాగానే ఉన్నప్పటికీ వాటిని పెద్ద ఇన్నింగ్స్ లుగా మార్చడం లేదు. ఈ సమస్య తీరాలంటే హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చాల్సి ఉంది. ప్రస్తుతం క్లాసెన్ ను నంబర్ 5లో ఆడిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ చిక్కు వుంది. క్లాసెన్ వచ్చీ రావడంతోనే భారీ షాట్స్ ఆడే ప్లేయర్ కాదు. కుదురుకోవడానికి కాస్త టైమ్ తీసుకొని ఆ తర్వాత దూకుడుగా ఆడే ప్లేయర్ అని మనందరికీ తెలుసు. ఈ క్రమంలో క్లాసెన్ ను 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ కు పంపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు.. ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డిలు కూడా ఫామ్ లేకపోవడం చాలా మైనస్. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ తనకు కేటాయించిన పర్సును ప్లేయింగ్ ఎలెవెన్ కోసమే ఖర్చు పెట్టింది కానీ... సరైన బ్యాకప్ ప్లేయర్లను కొనలేదు అనే అపవాదు బాగా వినబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL