చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్‌కు ఇది నిజంగా షాకింగ్ వీక్. సొంతగడ్డపై, చెపాక్ స్టేడియంలో.. CSK చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసి ఘోర పరాజయం చవిచూసింది. అది కూడా వరుసగా ఐదో ఓటమి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) లాంటి టీమ్.. 104 పరుగుల టార్గెట్‌ను 8 వికెట్లు తేడాతో, ఇంకా చెప్పాలంటే 10 ఓవర్లు మిగిలి ఉండగానే కొట్టేసింది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మ్యాచ్ తర్వాత కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం చాలా సీరియస్‌గా మాట్లాడాడు. బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ.. "చాలా మ్యాచులు మనకు అనుకూలంగా జరగలేదు. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సవాళ్లను స్వీకరించాలి. కష్టమైన బంతులను ఎలా ఎదుర్కోవాలో, పరుగులు ఎలా రాబట్టాలో ఆలోచించాలి" అని అన్నాడు. ధోనీ ఇంత సీరియస్‌గా మాట్లాడటం చాలా అరుదు.

ఈ సీజన్‌లో CSK ఎప్పుడూ ఛేజింగ్‌కే ప్రియారిటీ ఇచ్చింది. కానీ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయినా ఫలితం మారలేదు. పిచ్ మాత్రం నిజంగా ట్రిక్కీగా ఉంది. KKR బౌలర్లు వైభవ్ అరోరా, మోయిన్ అలీ కండిషన్స్‌ను బాగా వాడుకున్నారు. బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. పవర్ ప్లేలో CSK కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది, ఆ తర్వాత కుప్పకూలిపోయింది.

పిచ్ స్లోగానే ఉందని ధోనీ ఒప్పుకున్నాడు. కానీ తొందరగా వికెట్లు కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని చెప్పాడు. "మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. అదే పెద్ద సమస్య అయింది. భాగస్వామ్యాలు ఉంటే, ఎక్కువ పరుగులు వచ్చేవి, ఫోకస్ కూడా ఉండేది. ఇంకా మేం ట్రాక్‌లోకి రావచ్చు" అని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

పవర్ ప్లేలో CSK స్లో స్టార్ట్స్‌పై కూడా ధోనీ క్లారిటీ ఇచ్చాడు. "పిచ్‌కు తగ్గట్టు ఆడాలి. ఇతర జట్లను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. మా ఓపెనర్లు సమర్థులే. వాళ్ల బలాన్ని నమ్ముకోవాలి, తొందరపడి షాట్లు ఆడకూడదు. మొదటి ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయాలని చూడటం మనకు వర్కవుట్ కాదు. భాగస్వామ్యాలు నెలకొల్పి, ఆ తర్వాత పుంజుకోవడం మనకు మంచి ఛాన్స్" అని ధోనీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: