ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మ్యాచ్‌లో ఊహించని సీన్ ఒకటి జరిగింది. విరాట్ కోహ్లీ ఒక్కసారిగా సంజూ శాంసన్‌ని తన గుండె చప్పుడు చూడమని అడగడంతో అందరూ షాక్ అయ్యారు. భగభగ మండే ఎండలో, జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 42 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్నపుడు ఈ సంఘటన జరిగింది.

రెండో ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఇది జరిగింది. స్పిన్నర్ వనిందు హసరంగ బౌలింగ్‌లో కోహ్లీ రెండు పరుగులు తీశాడు. రన్ తీసిన వెంటనే కోహ్లీ కాస్త అలసిపోయినట్టు, ఇబ్బందిగా ఉన్నట్టు కనిపించాడు. వెంటనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ దగ్గరికి వెళ్లి “గుండె చప్పుడు చూడు” అని అడిగాడు. శాంసన్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే గ్లోవ్స్ తీసి కోహ్లీ ఛాతీపై చేయి పెట్టి చూశాడు. ఆ తర్వాత కూల్‌గా “అంతా ఓకే” అని చెప్పడంతో కోహ్లీతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సీన్ స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వడంతో వైరల్ అయిపోయింది. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. విపరీతమైన ఎండ వేడికి కోహ్లీ డీహైడ్రేషన్ (బాడీలో నీటి శాతం బాగా తగ్గిపోయాక వచ్చే నీరసం) వల్ల అలా అయి ఉంటాడని చెప్పాడు.

వెంటనే ఆర్సీబీ టీమ్ టైమ్ అవుట్ తీసుకుని కోహ్లీకి కాస్త విరామం ఇచ్చింది. టీమ్ డాక్టర్లు వచ్చి కోహ్లీని చెక్ చేసి, డ్రింక్స్ ఇచ్చి రీహైడ్రేట్ చేశారు. అదృష్టవశాత్తూ కోహ్లీకి పెద్దగా ఏమీ కాలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోహ్లీ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు.

కాస్త భయపెట్టినా కోహ్లీ మాత్రం 74 నిమిషాల పాటు మైదానంలోనే ఉండి ఆర్సీబీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 45 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. కోహ్లీ నిలకడగా ఆడి ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో, 15 బంతులు మిగిలి ఉండగానే గెలవడానికి కారణమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో 100వ హాఫ్ సెంచరీ, ఐపీఎల్‌లో 66వ హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. రియాన్ పరాగ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లీకి మరో లైఫ్ వచ్చింది. దాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుని టీమ్‌ను గెలిపించాడు.

చాలా కష్టమైన వాతావరణంలో కూడా కోహ్లీ ఆడిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. అతని పోరాట పటిమకు, ఆట మీద డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: