భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి అయినటువంటి మహేంద్ర సింగ్ ధోనీ మరోమారు తనదైన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల కష్టానికి క్రెడిట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే ధోనీ.. తాజాగా ఆ విషయాన్ని రుజువు చేయడంతో హాట్ టాపిక్ అయ్యాడు. విషయంలోకి వెళితే... ఐపీఎల్ 25 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించిన సంగతి అందరికీ తెలిసిందే. వరుసగా 5 పరాజయాల తర్వాత విజయం రుచి చూపడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

ఆఖరి ఓవర్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనీ(11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో విమర్శకులకు చెక్ పెట్టాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ అతనికే దక్కింది. అయితే ఈ అవార్డ్ తనకు ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావడం లేదని, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఇది అతనికి దక్కాల్సిందని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని బయటకి చెప్పాడు. హోస్ట్ మురళీ కార్తీక్.. 18వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలవడం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించగా.. ధోనీ ఈ విధంగా స్పందించడంతో హాట్ టాపిక్ అవుతోంది. అభిమానులు అయితే ధోనీ మంచితనాన్ని సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.

ఈ సందర్భంగా ధోనీ స్పందిస్తూ... "నాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఎందుకు ఇస్తున్నారో అస్సలు అర్ధం కావడం లేదు. ఈ అవార్డ్ కోసం ఇతర వ్యక్తలు ఉన్నారు. ముఖ్యంగా నా కంటే నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసారు కాబట్టే మ్యాచ్ మెలవడం సాధ్యం అయ్యింది. లేదంటే చాలా కష్టం అయ్యేది!" అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నూర్ అహ్మద్ ఒక్క వికెట్ తీయకపోయినా 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరోవైపు జడేజా 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: