ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ముంబై ఛేజింగ్‌లో 7వ ఓవర్ అది, SRH స్పిన్నర్ జీషన్ అన్సారీ వేసిన షార్ట్ బాల్‌ను ముంబై బ్యాటర్ ర్యాన్ రికెల్‌టన్ నేరుగా కవర్స్‌లో ఉన్న ప్యాట్ కమిన్స్ చేతుల్లోకి కొట్టాడు.

కమిన్స్ క్లీన్‌గా క్యాచ్ పట్టడంతో, రికెల్‌టన్ ఔటయ్యానని భావించి నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి అడుగుపెట్టేశాడు కూడా. అంతా సజావుగానే జరిగిందనుకున్నారు.

అయితే, రికెల్‌టన్ డ్రెస్సింగ్ రూమ్ మెట్లు ఎక్కబోతుండగా ఫోర్త్ అంపైర్ ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని మెట్ల దగ్గరే ఆపేశాడు. ఎందుకంటే, రీప్లేలో ఏదో తేడా కొట్టింది. థర్డ్ అంపైర్‌కు సమీక్ష కోసం నివేదించారు. థర్డ్ అంపైర్ రంగంలోకి దిగాడు. అందరూ క్యాచ్ గురించే అనుకుంటే, కెమెరాలు ఫోకస్ చేసింది మాత్రం SRH వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌పై.

అసలు విషయం ఏంటంటే.. బంతి వేయకముందే క్లాసెన్ గ్లోవ్స్ వికెట్ల ముందుకు వచ్చేశాయి. ఎంసీసీ క్రికెట్ రూల్స్ ప్రకారం (లా 27.3.1), కీపర్ బంతి బ్యాటర్‌ బ్యాట్‌కు లేదా శరీరానికి తగిలే వరకు, లేదా వికెట్లను దాటే వరకు, లేదా బ్యాటర్ పరుగు తీయడానికి ప్రయత్నించే వరకు పూర్తిగా వికెట్ల వెనకే ఉండాలి.

ఇక్కడే క్లాసెన్ తప్పు చేశాడు. ఈ రూల్‌ని అతిక్రమిస్తే, ఫీల్డ్ అంపైర్ 'నో బాల్'గా ప్రకటించాలని లా 27.3.2 స్పష్టంగా చెబుతోంది. టీవీ రీప్లేల్లో క్లాసెన్ గ్లోవ్స్ బంతిని రికెల్‌టన్ కొట్టకముందే లైన్ దాటినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో, థర్డ్ అంపైర్ దానిని 'నో బాల్'గా ప్రకటించాడు. అప్పటికే మైదానం వీడి డగౌట్ దగ్గరకు వెళ్లిన రికెల్‌టన్‌ను వెనక్కి పిలిచారు. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు అని అందరూ ఆశ్చర్యపోయారు.

ఊహించని లైఫ్ లభించడంతో, రికెల్‌టన్ ఆ అవకాశాన్ని కాస్త వాడుకున్నాడు. రెండు బౌండరీలు బాదాడు. అయితే, ఆ లైఫ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అతను పెవిలియన్ చేరాడు.

అంతకుముందు మ్యాచ్‌లో, నెమ్మదిగా ఉన్న వాంఖడే పిచ్‌పై SRH బ్యాటర్లు మొదట తడబడ్డారు. కానీ చివరి ఐదు ఓవర్లలో 57 పరుగులు పిండుకుని పోరాడే స్కోరు (162/5) సాధించారు. ముంబై బౌలర్లు మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బుమ్రా 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు, బౌల్ట్ 4 ఓవర్లలో 29 పరుగులివ్వగా, విల్ జాక్స్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 2 కీలక వికెట్లతో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: