క్రీడాభిమానులకి శుభ్ మన్ గిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన నాయకత్వంలోని GT (గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ తాజా సీజన్ లో మరో గెలుపుపై కన్నేసినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఈపాటికే 7 మ్యాచ్ ల్లో 5 విజయాలతో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు సాధించింది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్ మన్ గిల్ అద్బుతంగా రాణించాడు. మొత్తం 55 బంతులకు గాను 10 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి ఏకంగా 90 పరుగులు ఛేదించాడు. అయితే జస్ట్ 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకొని వెనుదిరిగాడు.

అతని సహ ఓపెనర్ సాయి సుదర్శన్ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ మరో అర్ధసెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. సుదర్శన్ మొత్తం 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేసి ఆండ్రీ రసెల్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. వన్ డౌన్ లో వచ్చిన జోస్ బట్లర్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో పర్వాలేదు అనిపించాడు. బట్లర్ 23 బంతుల్లో 8 ఫోర్లతో అజేయంగా నిలిచి, 41 పరుగులు చేశాడు. రాహుల్ తెవాటియా (0) డకౌట్ కావడం కొసమెరుపు. కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా 1, హర్షిత్ రాణా 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ తీశారు.

ఇక అసలు విషయంలోకి వెళితే... KKR - GT మ్యాచ్ టాస్ సందర్భంగా శుభ్ మన్ గిల్ వివాహం గురించి కామెంటార్ డానీ ప్రశ్నించగా... గిల్ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పి అందరికీ నవ్వు తెప్పించాడు. డానీ 'నువ్వు చాలా అందంగా వున్నావ్? మరి త్వరలో పెళ్లి చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది!' అని ప్రశ్నించగా... గిల్ కాస్త సిగ్గు పడుతూ... 'అలాంటిదేం లేదు.. ఒకవేళ ఆ సమయం వస్తే తప్పకుండా నేను చెబుతాను. కంగారు పడవద్దు!' అంటూ విషయాన్ని డైవర్ట్ చేసాడు. దాంతో డానీ నవ్వేసాడు. ఇకపోతే, గిల్ సచిన్ కూతురు సారాతో డేటింగ్ లో ఉన్నట్టు పలు కధనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై ఇరువురు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. అయితే వారిద్దరూ ఒకటి కావాలని అభిమానులు మాత్రం తెగ కలలు కంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: