DC vs LSG ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో KL రాహుల్ కీలక పాత్ర పోషించాడు. కానీ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమానులతో అతడి ప్రవర్తన అంతకంటే ఎక్కువ చర్చనీయాంశమైంది. రాహుల్ చూపించిన కోల్డ్ రియాక్షన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

గత మూడు ఐపీఎల్ సీజన్లలో LSG తరఫున ఆడిన రాహుల్ కు లక్నో మైదానం చాలా ప్రత్యేకం. ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాతో విభేదాల కారణంగానే అతను LSG ని వీడాడని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రాహుల్, లక్నో పిచ్ పై తన అనుభవాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.

కేవలం 42 బంతుల్లోనే అజేయంగా 57 పరుగులు చేసి, ఢిల్లీ 160 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడంలో సహాయపడ్డాడు. ఈ క్రమంలోనే, ఐపీఎల్ చరిత్రలో అతి వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. కేవలం 130 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించి, గత రికార్డు హోల్డర్ డేవిడ్ వార్నర్ కంటే 5 ఇన్నింగ్స్ ముందున్నాడు.

అయితే, అసలు డ్రామా మొదలైంది ఇక్కడే. మ్యాచ్ ముగిసిన తర్వాత, LSG యజమాని సంజీవ్ గోయెంకా నేరుగా మైదానంలోకి వచ్చి రాహుల్ ను పలకరించారు. కరచాలనం చేసి, రాహుల్ అద్భుతమైన ఆటతీరును మనస్ఫూర్తిగా ప్రశంసించారు. కానీ రాహుల్ ముఖంలో మాత్రం ఎలాంటి హావభావాలు లేవు. పెద్దగా స్పందించలేదు, ఎలాంటి సంభాషణకు దిగకుండా, ప్రశంసలను కూడా పట్టించుకోకుండానే అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయాడు.

గోయెంకా కుమారుడు శశ్వత్ కూడా రాహుల్ తో మాట్లాడటానికి ప్రయత్నించగా, రాహుల్ అతనికీ అదే కోల్డ్ ట్రీట్‌మెంట్ ఇచ్చి వెళ్లిపోతూనే ఉన్నాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఈ unexpected reaction చూసి ఆశ్చర్యపోయి, రాహుల్ ను ఆపడానికి ప్రయత్నించినా అతను ఆగలేదు.

ఈ వింత సన్నివేశానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఈ మ్యాచ్ కంటే ముందు, గోయెంకా స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పరోక్షంగా రాహుల్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టుకు విలువనిచ్చే, టీమ్ కోసం ఆడే ఆటగాళ్లను మాత్రమే LSG కోరుకుంటుందని ఆయన పరోక్షంగా అన్నారు.

దీనిపై రాహుల్ కూడా గతంలోనే మరో ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు స్వేచ్ఛగా ఆడే అవకాశం, మెరుగైన టీమ్ వాతావరణం ఉన్న జట్లను తాను ఇష్టపడతానని పరోక్షంగా గోయెంకా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.

ఇప్పుడు లక్నో మైదానంలో జరిగిన ఈ పోస్ట్-మ్యాచ్ దృశ్యం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. రాహుల్ మౌనంగానే తన బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చాడని, ఇది పాత లెక్కలకు ప్రతీకారమేనని అభిమానులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: