
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా పహల్గాం టెర్రరిస్ట్ దాడి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కి 'ఐసిస్ కశ్మీర్' నుంచి లైఫ్ థ్రెట్ మెయిల్ వచ్చింది. అతనిని త్వరలో చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ పంపడంతో గంభీర్ బుధవారం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పహల్గాం టెర్రరిస్ట్ దాడిని గౌతమ్ గంభీర్ చాలా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తీవ్రవాదులు అతనికి మెయిల్ పంపినట్టు తెలుస్తోంది.
తీవ్రవాద దాడిగురించి గంభీర్ స్పందిస్తూ... ఈ దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ, భారతదేశం ఈ దారుణమైన చర్యకు ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటుందని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో మృతుల కుటుంబాలు త్వరగా కోలుకోవాలని కూడా ప్రార్థిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారంతా ఇంతకింత అనుభవించాల్సి ఉంటుందని, దారుణమైన పరిస్థితులు రాబోయే రోజుల్లో చూస్తారని రాసుకొచ్చారు.
ఇక ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు అత్యంత పాశవికంగా చంపబడ్డారు. ఈ దాడికి లష్కర్-ఎ-తైయబా ప్రాక్సీ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది కూడా. అయితే, పాకిస్థాన పాత్ర బహిర్గతమైన తరువాత తన వైఖరి మారింది. ఈ ఉగ్రవాద దాడిలో తనకు ఎలాంటి పాత్ర లేదని బుకాయిస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ దాడిలో తమకు ఎలాంటి పాత్ర లేదని, అనవసరంగా అపార్ధం చేసుకోవద్దని వివరణ ఇచ్చ్చారు. కానీ వారి మాటలు వైన్ పరిస్థితుల్లో ఇపుడు భారతీయులు లేరు. జమ్మూ-కశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు. విచారణ కోసం వందలాది మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సీసీఎస్ సమావేశం జరిగింది. పాకిస్థాాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.