నవీన మాట్లాడుతూ.. మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎంతో కష్టపడింది. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చీరలు అమ్ముతూ, మిషన్ కుడుతూ వచ్చిన డబ్బుతో మమ్మల్ని చదివించింది. నేను షూటింగ్ కి వెళ్తే నా పిల్లల్ని మా అమ్మే చూసుకుంటుంది. నిజానికి నేను నటన రంగంలోకి ఇష్టంగా రాలేదు. డబ్బుకోసమే వచ్చాను. అప్పట్లో సినిమాలలో అవకాశాలు రావాలంటే ఫోటోషూట్స్ చేయించుకొని మరి అవి పట్టుకొని తిరిగే వాళ్ళం. అందుకోసం మా అమ్మ దగ్గర ఉన్న ఒకే ఒక బంగారు నగ కూడా అమ్మేసి, నాకు డబ్బులు ఇచ్చి ఫోటోలు తీయించింది.ఇక నేను కాదంటే అవుననిలే, వీరి వీరి గుమ్మడి పండు వంటి సినిమాలలో హీరోయిన్గా చేశాను .ఇంకో రెండు సినిమాలలో కూడా చేశాను. కానీ అవి విడుదల కాలేదు. త్రిశూలం సీరియల్ చేస్తున్నప్పుడు నాకు నటన సరిగా రాదని డైరెక్టర్ సత్యనారాయణ సెట్ లోనే అరిచేవాడు. ఒకరోజు గట్టిగా అరవడంతో ఏడ్చి వెళ్లిపోయాను. ఆ తర్వాత మా మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాము.
ఒక సీరియల్ చేయడానికి మేము దాదాపు రూ.70 లక్షల వరకు ఖర్చు చేసాము. అయితే అగ్రిమెంట్ దగ్గర తేడా రావడంతో 100 ఎపిసోడ్లకి సీరియల్ ఆపేయడం జరిగింది. దాంతో రూ.20 లక్షలు వెనక్కి వచ్చాయి. కానీ రూ 50 లక్షలు నష్టం తీర్చడానికి మా దగ్గర ఉన్న భూమి కూడా అమ్మేసి అప్పులు తీర్చాము. నాకు నా దగ్గర ఒక కిలో బంగారం ఉండాలనేది నా కల. టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆ బంగారాన్ని కొనుగోలు చేశాను అంటూ చెప్పుకొచ్చింది నవీన.