చంద్రుడి దక్షిణ ధృవంలో చంద్రయాన్ 2 భారతదేశ జ్ఞాపకంగా మిగిలిపోనుంది. విక్రమ్ ల్యాండర్ మరి కొన్ని గంటల్లో మూగబోనుంది. దీంతో ఇస్రో నుంచి ఓ భావోద్వేగ ప్రకటన విడుదలైంది. తమకు మద్దతుగా నిలిచిన దేశప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ  ..మీ సహాయ సహకారాలతో మరింత ముందుకు వెళ్తామని  ట్వీట్ చేసింది.   


చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌ 2.  ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 2... 95శాతం సక్సెస్ సాధించి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆ సమయంలో  శాస్త్రవేత్తలు మనోవేదనకు గురైన వేళ.. యావత్ దేశం వారికి మద్దతుగా నిలిచి హ్యాట్సాప్ చెప్పింది. తమకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కతజ్ఞతలు చెబుతూ ఇస్రో భావోద్వేగ ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తిగా భవిష్యత్తులో మరింత ముందుకు సాగుతామని, అంతరిక్ష బాటలో సజావుగా సాగేందుకు మీ స్ఫూర్తి మాకెంతో తోడ్పడుతుందని ట్వీట్ చేసింది. 


చంద్రయాన్ 2 చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలోకి వెళ్లిన తర్వాత..  ఇస్రోతో కమ్యూనికేషన్ కట్ అయ్యింది. దీంతో ల్యాండర్ నుంచి రోవర్ బయటకు రాలేకపోయింది. ఈ రెండింటి కాల పరిమితి 14 రోజులు. ఈ రెండు వారాలు సిగ్నల్స్ కోసం శతవిధాలా ప్రయత్నించింది ఇస్రో. నాసా సాయం కూడా తీసుకుంది. అయినా ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించలేకపోయారు. 


చంద్రయాన్‌-2 ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలో సాధారణంగానే పని చేస్తున్నట్టు ఇస్రో తెలిపింది. పేలోడర్స్‌ కూడా బాగానే పనిచేస్తున్నాయి. అయినప్పటికీ విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు కలవకపోవడానికి గల కారణాలను జాతీయ స్థాయి కమిటీతో పాటు ఇస్రో నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై ఉన్న ల్యాండర్‌ విక్రమ్‌ ఫొటోలు తీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: