రైలు పట్టాలను మీరు ఎప్పుడైన గమనించారా? అవును గమనించాము...అయితే ఏంటంటా అనుకుంటున్నారా..? ప‌్రతి ఒక్కరు గమనించే ఉంటారు. కానీ కొన్నింటిని పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే రైలు ఎక్కడానికి వెళ్లిన వారు రైలు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తాము తప్ప...ఇతర విషయాలేవి గమనించి ఉండరు. అలాంటిది మీకొకటి చెప్పబోతున్నాము. రైలు పట్టాల మధ్య కానీ, పట్టాల చుట్టు పక్కల కంకర రాళ్లను వేసిన దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ అవి ఎందుకు వేశారో అనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి పెద్దగా పట్టించుకోం కూడా. మరీ కంకర రాళ్లను ఎందుకు వేస్తారో చూద్దాం.
రైలు పట్టాలు వేసే ముందు ప్రత్యేక దిమ్మెలను భూమిపై పర్చి వాటిపై రైలు పట్టాలను అమర్చుతారు. అయితే గతంలో చెక్కతో చేసిన దిమ్మెలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ప్రత్యేక కాంక్రిట్‌తో తయారు చేసిన దిమ్మెలను వేస్తున్నారు. తర్వాత పట్టాల మధ్యలో, చుట్టుపక్కల కంకర రాళ్లను వేస్తారు. కంకర రాళ్ల వల్ల పట్టాల కింద ఉండే దిమ్మెలు కదలకుండా ఉంటాయి. పట్టాలపై రైలు ప్రయాణించినప్పుడు కంకర రాళ్ల వల్ల పట్టాలు ఎటు కదలకుండా దిమ్మెలు ఫిక్సై ఉంటాయి. రైలు వెళ్తున్నప్పుడు ప్రమాదం ఉండదు. అలాగే వర్షం పడినప్పుడు కంకర ఉండటం వల్ల నీరు సులభంగా భూమిలోకి ఇంకిపోతుంది. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అటంకం ఏర్పడదు.
మరో విషయం ఏంటంటే...వర్షం వచ్చినా కంకర ఉండటం వల్ల ట్రాక్ కొట్టుకుపోకుండా ఉంటుంది. సాధారణంగా భూమిపై చిన్న చిన్న మొక్కలు, ముళ్లపొదలు పెరుగుతుంటాయి. కానీ రైలు పట్టాల మధ్య కంకర ఉండటం వల్ల పిచ్చి మొక్కలు, పొదళ్లు లాంటివి ఏమి పెరగవు. కంకర లేకపోతే పిచ్చి మొక్కలు పెరిగి రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే పట్టాల మధ్యలో కానీ, చుట్టుపక్కల ప్రాంతంలో కంకర రాళ్లు వేస్తారు. సో.... రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేయడంలో అసలైన రహహస్యం ఇదన్నమాట.