మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన యాప్ `దిశ యాప్`. స్మార్ట్ ఫోన్‌లో ఈ చిన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చేసుకుని.. ఆపద సమయంలో చిన్న బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు చేరుకునేలా యాప్‌ను తయారు చేశారు. దిశ యాప్ కు ఇప్పుడు ఏపీలో తెగ డిమాండ్ ఉంది. ఈ యాప్ ను నాలుగు రోజుల క్రితం విడుదల చేయగా, ఇప్పటికే 50 వేలకు డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. ఇటీవల ఓ యువతిని దుండగుల నుంచి రక్షించడంతో యాప్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. అయితే మరి దీన్ని ఎలా వాడాలి.. దీని ప్రత్యేకతలు ఏంటి..? అన్నది ఇప్పుడు చూద్దాం.
దిశ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది. మొదటిసారి డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ అవసరం. ఆ తర్వాత నెట్ ఉన్న లేకపోయిన ఈ యాప్‌ను వాడుకునేలా రూపొందించడం దీని ప్రత్యేకత. ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. ఇక యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేసేంత సమయం లేకపోతే ఫోన్‌ని గట్టిగా ఊపినా చాలు. మీరు ఎక్కడున్నారో లొకేషన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది.
అంతేకాకుండా మొబైల్ ఏ లోకేషన్‌లో ఉందొ 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో కూడా కంట్రోల్ రూంకి చేరతాయి. ఇక ఆ యాప్ లో ' ట్రాక్ మై ట్రావెల్' అనే ఒక ఆప్షన్ ఉంటుంది. 'ట్రాక్ మై ట్రావెల్' ఆప్షన్‌లో బయల్దేరిన ప్రదేశం, ఎక్కడికి వెళుతున్నారో నమోదు చేయాలి. అప్పుడు వెళ్తున్న మార్గాన్ని కంట్రోల్ రూం నుంచి గమనిస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి వేరే మార్గంలోకి ఆటో లేదా క్యాబ్‌లో వెళుతుంటే ఆ మార్గంలోని పోలీస్ స్టేషన్ లకి అప్రమత్తం చేస్తూ ఓ మెసేజ్ వెళుతుంది.
అలాగే ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. ఇక దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు కూడా ఉంటాయి. అలాగే ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు లేదా మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్ లో సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత, వైద్య అవసరాలు లాంటి ఎన్నో ఆప్షన్లును కూడా పొందుపరిచారు.