
నేటి సమాజంలో ల్యాప్‌టాప్ వినిపయోగం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. హై రిజల్యూషన్, వేగవంతమైన ప్రాసెసర్, ఆధునిక ఫీచర్లతో చేతిలో ఇమిడిపోయే సైజుల్లో ల్యాప్‌ట్యాప్‌లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ల్యాప్‌టాప్ సైజు, బరువుతో పాటు ధరలు తగ్గి సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు కూడా ల్యాప్‌టాప్‌ను వినియోగిస్తున్నారు. పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువు చేస్తున్న సౌకర్యవంతమైన గాడ్జెట్లలో ల్యాప్‌టాప్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఏదైనా పనిచేయాలంటే కరెంట్ తప్పకుండా ఉండాలి.
అందుకే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే గ్యాడ్జెట్ మన్నిక లోపించటంతో పాటు విద్యుత్తు ఛార్జీలతో బిల్లులు మోతెక్కిపోవాల్సిందే. అందులో ముందుగా.. ల్యాప్‌టాప్‌ని ఉపయోగించుకొన్న తర్వాత చాలా మంది ఛార్జర్‌ని అలాగే ప్లగ్ బోర్డులకి ఉంచేస్తారు. ఆ సమయంలోనూ అది విద్యుత్‌ని స్వీకరిస్తుందని గ్రహించాలి. ఇలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపడయ్యేట్లు చేస్తుంది. కాబట్టి, ల్యాప్‌టాప్ వినియోగించుకున్న తర్వాత ప్లగ్ బోర్డుకు ఛార్జర్‌ను కూడా తొలిగించండి. అలాగే డెస్క్‌టాప్ కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లను స్విచాఫ్ చేయకుండా స్టాండ్ బై మోడ్‌లో పెడితే రోజుకు 96 వాట్ల వరకు కరెంటు వృథా అవుతుంది.
కాబట్టి అవసరం అనుకుంటేనే వీటిని ఆన్ చేయండి. లేదంటే స్విచాఫ్‌లోనే ఉంచండి. ఇలా చేయడం తక్కువ కరెంట్ కూడా ఖర్చు అవుతుంది. అదేవిధంగా.. మరీ చిన్నపాటి విరామానికే షట్‌డౌన్ చేయడం ఎందుకూ అనుకుంటే కనీసం మానిటర్ని కట్టేయాలి. ఇలా చేస్తే సగం విద్యుత్ ఆదా అవుతుంది. ఎందుకంటే.. కంప్యూటర్ వినియోగించుకొనే శక్తిలో సగం మానిటరే ఉపయోగించుకుంటుంది కనుక. ఇక అందమైన స్క్రీన్ సేవర్ అందరూ చూస్తారనే వదిలేసా అని చాలా మంది చెబుతుంటారు. కానీ, దాని వల్ల చాలా విద్యుత్ వృధా అయిపోతుంది. కొన్ని గంటలు అలా వదిలేస్తే ఖర్చయ్యే శక్తి...రోజంతా ఓ రిఫ్రిజిరేటర్ నడపడానికి కావాల్సిన విద్యుత్తుతో సమానం. కాబట్టి.. అవసరం లేనప్పుడు ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేయటం మంచిది.