
యూట్యూబ్.. పరిచయం అక్కర్లేని యాప్. అధిక స్మార్ట్‌ఫోన్ల వాడకం, తక్కువ మొత్తానికే మొబైల్ డేటా అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ వినియోగం కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. వినోదం కోసమైనా.. ఏదైనా సమాచారం కోసమైనా.. ఇంటర్నెట్ యూజర్లు మొట్టమొదటగా యూట్యూబ్‌నే సందర్శిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌లో తెలుగు వారి హవా ఓ రేంజ్‌లో పెరిగిందని చెప్పుకోవాలి. వాస్తవానికి గతంలో యూ ట్యూబ్‌కు అమెరికాలోనే ఎక్కువ మంది వినియోగదారులుండేవారు.
కానీ, ఇప్పుడు యూట్యూబ్ వినియోగంతో అమెరికాను భరత్ దాటేసింది. ఇక ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో కంటెంట్ వైవిధ్యంగానూ, అదే సమయంలో సమతూకంగా కూడా ఉంటుంది. అందుకే యూట్యూబ్‌లో తెలుగు కంటెంట్‌కు క్రేజ్ బాగా ఏర్పడింది. ఇవన్నీ పక్కన పెడితే.. సాధారణంగా యూట్యూబ్‌లో ఏ వీడియోల గురించి అయినా సెర్చ్ చేస్తే అది మీ సెర్చ్ హిస్టరీలో కనిపిస్తుంది. ఇక ఏదైనా వీడియోను చూస్తే అది మీ వాచ్ హిస్టరీలో కనపడుతుంది. కానీ, అలా కనిపించకూడదని చాలా మంది కోరుకుంటారు. అందుకు ఓ మార్గం ఉంది.
ఇందుకోసం ముందుగా.. మీ ఫోన్ లో ఉన్న యూట్యూబ్ యాప్ లోకి వెళ్లండి. అన్నిటికంటే పైన మీకు వీడియో, సెర్చ్ సింబల్స్ కనిపిస్తాయి. దాని పక్కనే మీ అకౌంట్ కు సంబంధించిన గుర్తు ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ ఆప్షన్ల కింద మీకు సెట్టింగ్స్ కనిపిస్తాయి. అందులోకి వెళ్లండి. సెట్టింగ్స్ లోకి వెళ్లాక మీకు హిస్టరీ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే.. అక్కడ మీకు పాజ్ వాచ్ హిస్టరీ, పాజ్ సెర్చ్ హిస్టరీ ఆప్షన్లు కనిపిస్తాయి. మామూలుగా అవి ఆఫ్ అయి ఉంటాయి. కానీ, వాటిని ఆన్ చేస్తే.. ఇంక మీరు యూట్యూబ్ లో ఏం చేసినా, ఏం చూసినా దానికి సంబంధించిన హిస్టరీ మీ అకౌంట్ లో స్టోర్ అవ్వదు.