ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్ కొనగానే సరిపోదు. దానిని సరిగా వినియోగించడం కూడా ఎంతో అవసరం. అందులోనూ మొబైల్ బ్యాటరీని చార్జింగ్ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మొబైల్స్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. చార్జింగ్ పెట్టి వినియోగించడం వల్ల ఇప్పటికే అనేక చోట్ల మొబైల్స్ పేలిన సంఘటనల అడపాదడపా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే అలాంటి దుర్ఘటనలు మనకు కూడా ఎదురు కాకూడదంటే చార్జింగ్ పెట్టే సమయంలో అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

దీనివల్ల ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా మొబైల్ లైఫ్ టైం కూడా పెరుగుతుంది. అయితే ఇప్పటికీ అనేకమంది మొబైల్ వినియోగదారులకు దీనిపై సరైన అవగాహన లేదు. ఈ క్రమంలోనే ఎలా పడితే అలా చార్జింగ్ పెట్టి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఆ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్‌ను అనేకమంది రాత్రిళ్లు చార్జింగ్ పెట్టి అలా వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల కేవలం 3 గంటల్లో చార్జింగ్ పూర్తయినప్పటికీ మిగతా సమయం అంతా అలా పవర్‌కు ప్లగ్ అయ్యే ఉండడం వల్ల అనేక సమస్యలు తలెత్తతుతాయని అనుకుంటుంటారు. అయితే పాత మొబైల్స్‌లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుతం వచ్చే స్మార్ట్ ఫోన్లలో ఈ సమస్య 99 శాతం తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పటి ఫోన్లలో చార్జింగ్‌ను ఆటోమేటిక్‌గా నిలువరించే టెక్నాలజీ ఇన్‌బిల్డ్‌గా ఉంటుంది.

దానివల్ల రాత్రంతా చార్జింగ్ పెట్టినా మొబైల్ ఫుల్ చార్జ్ కాగానే ఎలక్ట్రిసిటీ సరఫరా నిలిచిపోతుంది. అయితే రాత్రంతా చార్జింగ్‌లో ఉండడం వల్ల మొబైల్‌లో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దీనివల్ల మొబైల్ హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ సమస్య నుంచి మొబైల్‌ను కాపాడుకోవాలంటే కేస్‌లలో నుంచి మొబైల్‌ను తీసి వేరుగా చార్జింగ్ పెట్టాలి.

ముఖ్యంగా మొబైల్ చార్జింగ్ చేసే సమయంలో ఆ మొబైల్‌కు కంపెనీ ఇచ్చిన చార్జర్‌నే వినియోగించాలి. అలా కాకుండా వేరే చార్జర్లను వినియోగించినా, ఒకే చార్జర్‌ను వేరు వేరు మొబైల్స్‌కు వినియోగించినా ఆ చార్జర్ డ్యామేజ్ అయి ఆ ప్రభావం మొబైల్‌పై కూడా పడుతుంది. అంతేకాకుండా వోల్టేజ్ సమస్యలు తెలెత్తి చార్జర్లు కాలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో వేరే ఛార్జర్‌ను వినియోగించాల్సి వచ్చినా దానితో వంద శాతం ఛార్జ్ పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే బ్యాటరీ చివరి 20 శాతం ఛార్జ్‌ అయ్యే సమయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుంది. ఆ సమయంలో డూప్లికేట్ చార్జర్ అయితే అది పేలిపోయే ప్రమాదం ఉంది.

ఇక కొంతమంది ఫోన్‌లో పూర్తి చార్జింగ్ అయిపోయేవరకు దానికి చార్జింగ్ పెట్టరు. పూర్తిగా జీరో అయిన తర్వాత ఛార్జ్‌ చేయడం మంచిదని నమ్ముతుంటారు. కానీ అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. బ్యాటరీ ఛార్జింగ్ 20 నుంచి 30 శాతం మధ్య ఉన్నప్పుడే ఛార్జ్‌ చేయాలి. అంతకన్నా తక్కువ అయిన తర్వాత ఛార్జ్‌ చేస్తే అది బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అదే మీ ఫోన్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటే మీరు ఛార్జింగ్ 20 శాతానికి వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీ మొబైల్ బ్యాటరీ జీవితకాలం పెరగడంతో పాటు మీ ఫోన్‌ బ్యాటరీ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: