సోష‌ల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నిబంధ‌న‌లు వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని మెసేజింగ్ యాప్ వాట్సాప్ అభిప్రాయపడింది. బుధవారం నుండి కొత్త ఐటీ నియమ నిబంధనలు అమల్లోకి వ‌చ్చాయి. ఈ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా వాట్సాప్ కోర్టును వెళ్లింది. ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. ఐతే గూగుల్ మాత్రం ఈ నిబంధనలు పాటిస్తామని తెలిపింది. కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తామని వెల్లడించింది. వాట్సాప్ కోర్టుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఐటీ నిబంధనల వల్ల యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని వాట్సాప్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదం రాజుకుంది. తాజాగా వాట్సాప్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ నిబంధనను వెనక్కి తీసుకుంది. కొత్త పాలసీ అంగీకరించని ఖాతాలను నిలిపివేస్తామని గతంలో వాట్సాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త పాలసీని అంగీకరించకున్నా వాట్సాప్ లో ని అన్ని ఫీచర్లు వినియోగించుకోవచ్చని తాజాగా వెల్లడించింది.

అంగీకరించని వారికి నోటిఫికేషన్లు పంపి దీని గురించి వివరిస్తామని తెలిపింది. ఇకపోతే సోషల్ మీడియా వినియోగదారులపై నిఘా ఏర్పాటు చేయనున్నట్లు కొత్త ఐటీ నిబంధనల్లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదంతా కేవలం దుష్ప్రచారమే అని పేర్కొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా  ద్వారా ఇటీవల ప్రకటించింది. నిబంధనలపై సోషల్ మీడియా లో  వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సోషల్ మీడియా యూజర్లను తరచూ పర్యవేక్షించడం సహా ఫోన్ కాల్స్ ను పరిశీలించడం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల్లో భాగమని ప్రచారం సాగుతోంది. వాట్సాప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దీటుగా స్పందించింది. దేశ సార్వభౌమత్వం, శాంతిభద్రతలకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లో ప్రభుత్వం యూజర్ల వ్యక్తిగత సమాచారం కోరుతుందని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: