అనంత విశ్వం ఏర్పడ్డ నుంచి మానవ కణ నిర్మాణం వరకు సైన్స్ శోధించని అంశమంటూ లేదు. మానవ పుట్టుక, జీవ పరిణామ క్రమం, ప్రకృతి ధర్మం, శరీర నిర్మాణం వంటి అంశాలలో ఇప్పటికే ఎంతో విజ్ఞన ప్రగతిని సాధించాం. ఇదే మార్గంలో సృష్టికి ప్రతి సృష్టి సృష్టించే కొత్త ప్రయోగాలకు బాటలు పడుతున్నాయి. ఇందులో భాగంగానే మగవారిలో గర్భధారణ ప్రయోగాలకు చైనా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రాథమికంగా ఎలుకల్లో చేసిన ప్రయోగం విజయవంతమైంది. అయితే ఈ ప్రయోగం సృష్టి గమనానికి విరుద్ధంగా ఉందని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.
చైనాలోని షాంగై నగరంలోని ఓ ప్రయోగశాలలో సిజేరియన్ ద్వారా మగ ఎలుక పదిమంది పిల్లలకు జన్మనిచ్చింది. నావల్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు ర్యాట్ మోడల్ -6 పేరుతో ఈ ప్రయోగాన్ని చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా ఆరోగ్యంగా ఉన్న ఒక మగ ఎలుక, ఆడ ఎలుకలను తీసుకున్నారు. వాటి చర్మాన్ని కత్తిరించి రెండింటి శరీర భాగాలను ఉమ్మడిగా రక్తనాళాలను ఏర్పాటు చేశారు. తర్వాత మగ ఎలుక వృషణాలను తొలగించి దాని శరీరంలో గర్భసంచిని అమర్చారు. అనంతరం రెండు ఎలుకలు గర్భసంచిలోకి గర్భస్థ పిండాలను పెట్టారు. 21.5 రోజుల అనంతరం మగ, ఆడ ఎలుకల గర్భసంచుల్లో సంపూర్ణంగా పిల్లలు ఎదగడాన్ని గుర్తించారు. ముఖ్యంగా మగ ఎలుక గర్భసంచిలో పది ఎలుకలు ఎదగడాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సిజేరియన్ ద్వారా బయటకు తీసిన ఈ ఎలుక పిల్లల పునరుత్పత్తి అవయవాలు గుండె స్పందనలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతరత్రా అవయవాలు మంచిగా పని చేస్తున్నట్టు డాక్టర్లు గుర్తించారు. మనుషుల్లో కూడా త్వరలో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అయితే మగజీవులు జన్మనివ్వడం ఇప్పటికే ప్రకృతి లో ఉన్నది. సిగ్నటీడే అనే చేప జాతికి చెందిన మగ సి-హార్సెస్ , సి - డ్రాగన్లు, ఫైన్ ఫిష్లు గర్భం దాల్చుతాయి. అంతేకాకుండా అమెరికాకు చెందిన తమస్ ట్రేస్ భేటీ అనే మహిళ లింగ మార్పిడి చేయించుకొని పురుషునిగా మారారు. అనంతరం 2007లో కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా గర్భం దాల్చి ప్రపంచంలో గర్భందాల్చిన తొలి పురుషుడుగా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం అతనికి నలుగురు పిల్లలు. ఏది ఏమైనా ఈ ప్రయోగం పూర్తిగా మగవారి మీద సక్సెస్ అయితే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి..